Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీకోసం.. 

Published : 13 Apr 2022 16:55 IST

1. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ ఛార్జీల పెంపు

ఆంధ్రప్రదేశ్‌లో బస్సు ఛార్జీలను ఆర్టీసీ పెంచింది. డీజిల్‌ ధరల పెరుగుదల నేపథ్యంలో టికెట్‌ ధరపై ఎలాంటి మార్పు చేయకుండా డీజిల్‌ సెస్‌ పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు వెల్లడించారు. పల్లె వెలుగు బస్సులకు రూ.2 చొప్పున, ఎక్స్‌ప్రెస్ సర్వీసులకు రూ.5 చొప్పున, హైఎండ్‌ (ఎసీ) బస్సులకు రూ.10 చొప్పున డీజిల్‌ సెస్ పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

విజయ్‌ ‘బీస్ట్’మూవీ రివ్యూ

2. ఐఏఎస్‌ శ్రీలక్ష్మి పిటిషన్‌ కొట్టేసిన హైకోర్టు

తన శిక్షను పునఃపరిశీలించాలని కోరుతూ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. హాస్టళ్లలో సామాజిక సేవ చేయాలని గతంలో ఉన్నత న్యాయస్థానం ఆమెను ఆదేశించింది. మరోవైపు కొద్ది రోజుల కిందట ఈ పిటిషన్‌ను దాఖలు చేసిన సమయంలో రిజిస్ట్రీ ఈ పిటిషన్‌ విచారణ అర్హతపై సందేహం వ్యక్తం చేస్తూ నంబర్‌ కేటాయించడానికి నిరాకరించారు. 

3. అత్యంత వేగంగా అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణ పనులు: కేటీఆర్

హైదరాబాద్‌ ఐమాక్స్‌ సమీపంలో 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని డిసెంబర్‌ నెలాఖరు నాటికి ప్రతిష్ఠిస్తామని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. రూ.150కోట్లతో చేపట్టిన విగ్రహ, ప్రాంగణ నిర్మాణ పనులు అత్యంత వేగంగా సాగుతున్నాయని చెప్పారు. మరో మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి అంబేడ్కర్‌ విగ్రహ ఏర్పాటు పనులను ఆయన పరిశీలించారు. హుస్సేన్‌సాగర్‌ తీరాన సచివాలయం సమీపంలో విగ్రహం ఏర్పాటువుతోందని చెప్పారు.

డోలో మాత్రపై భారత చిత్ర పటాన్ని గీసింది..

4. అక్బరుద్దీన్‌ నిర్దోషి.. తేల్చిన నాంపల్లి కోర్టు

మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారంటూ నమోదైన కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీని కోర్టు నిర్దోషిగా తేల్చింది. విద్వేషపూరిత ప్రసంగాలు చేసినట్లు ఆధారాలు చూపించలేదని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ మేరకు నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల న్యాయస్థానం తీర్పు వెలువరించింది. దేశ సార్వభౌమత్వం దృష్ట్యా వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదని అక్బరుద్దీన్‌కు సూచించింది.

5. జగన్‌ వ్యాఖ్యలు వారిని ఉద్దేశించినవే.. : జేసీ ప్రభాకర్‌రెడ్డి

వెంట్రుక కూడా పీకలేరన్న సీఎం జగన్‌ వ్యాఖ్యలు వైకాపా ఎమ్మెల్యేలను ఉద్దేశించే చేశారని తెదేపా సీనియర్‌ నేత, తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నచ్చిన వారికి కేబినెట్‌లో అవకాశం ఇస్తానని ఆ పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి అన్నారని తెలిపారు. తాను చెప్పిందే వేద వాక్కు అని వారికి చెప్పకనే చెప్పారని ప్రభాకర్‌రెడ్డి వివరించారు.

అమెరికాలో సిక్కులపై దాడి.. నగదు దోచుకెళ్లిన దుండగులు..

6. కర్ణాటక మంత్రి ఈశ్వరప్పపై కేసు..!

కర్ణాటకలో ఇటీవల వెలుగు చూసిన ‘40 శాతం కమీషన్‌’ వ్యవహారం భాజపా ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. ఈ కేసులో కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌  శాఖ మంత్రి కేఎస్‌ ఈశ్వరప్పపై తాజాగా కేసు నమోదయ్యింది. సివిల్‌ కాంట్రాక్టర్‌ ఆత్మహత్యకు ప్రేరేపించారనే అభియోగాలపై మంత్రిపై కేసు నమోదు చేసినట్లు మంగళూర్‌ పోలీసులు వెల్లడించారు.

7. జీ7కు భారత్‌ను ఆహ్వానిస్తారా..?

ప్రపంచంలోనే ఆర్థికంగా అత్యంత శక్తిమంతమైన జీ7 గ్రూపు సదస్సుకు భారత్‌కు ఈ సారి ఆహ్వానం లభించకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. భారత ప్రధాని మోదీకి ఆహ్వానం పంపడంపై ఆతిథ్య జర్మనీ తీవ్రంగా మల్లగుల్లాలు పడుతోంది. ఈ సదస్సు బవారియాలో జూన్‌లో జరగనుంది. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను ఖండించడానికి భారత్‌  అయిష్టత ప్రదర్శించడంపై జర్మనీ అసంతృప్తితో ఉంది.

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజా.. గుమ్మడికాయతో దిష్టి తీసిన భర్త

8.  కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటా సీట్లు రద్దు: కేంద్రం

దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో ప్రత్యేక కోటా సీట్లపై కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రీయ విద్యాలయాల్లో ఇకపై పార్లమెంటు సభ్యుల (ఎంపీల) కోటా కింద కేటాయించే ప్రత్యేక సీట్లను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు ఒక్కో ఎంపీకి ఏటా 10 సీట్లను కేబీఎస్‌ కేటాయిస్తూ వస్తోంది. 

9. నాకంటే ఎక్కువ ప్రతిభ అతడిలోనే ఉందనిపిస్తుంది: రికీ పాంటింగ్‌

టీమ్‌ఇండియా యువ బ్యాటర్ పృథ్వీ షాపై దిల్లీ కోచ్‌ రికీ పాంటింగ్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. ప్రస్తుత సీజన్‌లో నాలుగు మ్యాచుల్లో రెండు అర్ధశతకాలతో 160 పరుగులు చేశాడు. ఓపెనర్‌గా దూకుడుగా ఆడటంలో పృథ్వీ షా ఏమాత్రం ఆలోచించడని పాంటింగ్‌ పేర్కొన్నాడు. ‘‘నేను పృథ్వీ ఆటను పరిశీలిస్తుంటే ఒకటే అనిపిస్తుంది. నా కంటే ఎక్కువ టాలెంట్ అతడిలోనే ఉంది. అందుకే చెబుతున్నా టీమ్‌ఇండియా కోసం పృథ్వీ కనీసం వంద టెస్టులైనా ఆడాలని ఆశిస్తున్నా’’ అని పాంటింగ్‌ వివరించాడు.

ఈ మెషీన్ మా ప్రేమ కథకు నిజమైన హీరో..!

10. షాంఘై లాక్‌డౌన్‌ను అమెరికా ఆయుధంలా వాడుకొంటోంది..!

అమెరికా కాన్సులేట్‌ సిబ్బంది షాంఘైని వీడాలని ఆదేశించడాన్ని చైనా తప్పుపట్టింది. అమెరికా అధికారులు షాంఘై లాక్‌డౌన్‌ను కూడా దుష్ప్రచారానికి ఆయుధంలా వాడుకొనేందుకు చూస్తోందని ఆరోపించింది. దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ విషయాన్ని ఆ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్‌ న్యూస్‌ బ్రీఫింగ్‌లో వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని