Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీకోసం.. 

Updated : 26 Jun 2022 13:05 IST

1. కొల్లాపూర్‌లో ఉద్రిక్తత.. తెరాస ఎమ్మెల్యే అరెస్టు

నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో చర్చకు వెళ్తుండగా ఎమ్మెల్యేను అరెస్టు చేసి ఇతర ప్రదేశానికి తరలించారు. దీంతో బస్టాండ్‌ వద్ద ఎమ్మెల్యే బీరం వర్గీయులు ఆందోళనకు దిగారు. కొల్లాపూర్‌ నియోజకవర్గంలోని అధికార తెరాసలో వీరిద్దరూ రెండు వర్గాలుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

2. ఆత్మకూరు ఉపఎన్నిక.. వైకాపా ఏకపక్ష విజయం

నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికలో దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్‌ రెడ్డి ఘన విజయం సాధించారు. ఇవాళ ఉదయం ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచి వైకాపా అభ్యర్థిగా బరిలోకి దిగిన మేకపాటి విక్రమ్‌రెడ్డి తన ప్రత్యర్థులపై పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. మొత్తంగా 20 రౌండ్లలో లెక్కింపు చేపట్టగా.. ప్రతి రౌండ్‌లోనూ విక్రమ్‌రెడ్డి ఆధిక్యంలో కొనసాగారు.

3. ఓవైపు విమర్శలు.. మరోవైపు బుజ్జగింపులు

శివసేనలోని ఓ వర్గం ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడంతో మహారాష్ట్రలో తలెత్తిన రాజకీయ సంక్షోభానికి ఇప్పుడప్పుడే తెరపడే సూచనలు కనిపించడం లేదు. గువాహటిలో మకాం వేసి న రెబెల్‌ ఎమ్మెల్యేలు మరో రెండు రోజులు అక్కడే ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం. అలాగే వారంతా ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు భేటీ అయి తదుపరి కార్యాచరణ ఏంటో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

4. భారీగా తగ్గిన కొత్త కేసులు..

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. అయితే.. గత కొన్ని రోజులుగా 15వేలకుపైగానే నమోదువుతోన్న కొత్త కేసులు తాజాగా భారీగా తగ్గి 11 వేలకు దిగివచ్చాయి. మరోవైపు క్రియాశీల కేసులు 92 వేలు దాటడం ఆందోళన కలిగిస్తోంది.  నిన్న 4,53,940 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 11,739 కేసులు వెలుగు చూశాయి. కొత్త కేసుల్లో కేరళ(4,098), మహారాష్ట్ర (1,728), తమిళనాడు (1,382) నుంచే సగానికిపైగా ఉన్నాయి.

5. యోగి ఆదిత్యనాథ్‌ హెలికాప్టర్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ హెలికాప్టర్‌ ఆదివారం ఉదయం అత్యవసరంగా ల్యాండయ్యింది. లఖ్‌నవూ వెళ్లే నిమిత్తం వారణాసిలోని రిజర్వు పోలీసు లైన్స్‌ గ్రౌండ్‌ నుంచి హెలికాప్టర్‌ టేకాఫ్‌ అయ్యింది. కాసేపటికే హెలికాప్టర్‌ను ఓ పక్షి ఢీకొట్టడం వల్ల అత్యవసరంగా ల్యాండ్‌ చేయాల్సి వచ్చిందని అధికారిక వర్గాలు తెలిపాయి.

6. అమెరికాలో తుపాకుల నియంత్రణ బిల్లుపై బైడెన్‌ సంతకం..!

అమెరికాలో తుపాకుల నియంత్రణ చట్టంపై అధ్యక్షుడు జో బైడెన్‌ శనివారం సంతకం చేశారు.  తుపాకుల నియంత్రణకు కొన్ని దశాబ్దాల తర్వాత తీసుకొచ్చిన  అతిపెద్ద చట్టం ఇదే. బిల్లుపై సంతకాలు చేసిన తర్వాత జోబైడెన్‌ స్పందిస్తూ ‘‘ఈ చట్టం చాలా మంది ప్రాణాలను కాపాడనుంది’’ అని ప్రకటించారు. ఇటీవల టెక్సాస్‌లోని బఫెలో కాల్పుల ఘటన తర్వాత ఈ బిల్లు తెరపైకి వచ్చింది.

7. ప్రజాస్వామ్యాన్ని తొక్కి పెట్టేందుకు యత్నించారు.. ఎమర్జెన్సీని గుర్తుచేసుకున్న ప్రధాని

1975లో విధించిన ఎమర్జెన్సీ ద్వారా ప్రజాస్వామ్యాన్ని తొక్కిపెట్టే ప్రయత్నాలు జరిగాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. అలాంటి ధిక్కార ఆలోచనలను ప్రజాస్వామ్యరీతిలో ఓడించిన తీరు ప్రపంచంలోనే మరెక్కడా కనపడదని వ్యాఖ్యానించారు. నెలవారీ ‘మన్‌ కీ బాత్‌’లో భాగంగా ఆయన ఎమర్జెన్సీ నాటి రోజుల్ని గుర్తుచేసుకున్నారు. జూన్‌ 25, 1975న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన విషయం తెలిసిందే.

8. ఐర్లాండ్‌తో ఆడుతున్నామని చెప్పడం తేలికే.. అయినా.. : హార్దిక్

క్రికెట్‌లో పసికూనగా పేరున్న ఐర్లాండ్‌తో ఆడుతున్నామని చెప్పడం తేలికే అయినా టీమ్‌ఇండియా తరఫున ఆడటం పెద్ద గర్వకారణమని కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య అన్నాడు. ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌కు అతడు తొలిసారి టీమ్‌ఇండియాకు కెప్టెన్సీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మ్యాచ్‌కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో హార్దిక్‌ మాట్లాడాడు.

9. దయచేసి అందరూ ఇలా చేయండి: నాగబాబు

నెటిజన్లకు నటుడు నాగబాబు(Nagababu) చిన్న విజ్ఞప్తి చేశారు. ఇష్టమైన వారు మనతో ఉన్నప్పుడే వాళ్లపై మనకెంత ప్రేమ ఉందో తెలియజేయాలని కోరారు. శనివారం తన తండ్రి వెంకటరావు జయంతిని పురస్కరించుకుని ఆయన ఇన్‌స్టా వేదికగా ఓ భావోద్వేగపు పోస్ట్‌ పెట్టారు. ‘‘నాన్నా నీకు జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు బతికి ఉన్నప్పుడు చెప్పాలన్న బుద్ధి, జ్ఞానం నాకు లేవు.. అవి వచ్చాయనుకున్నప్పుడు నువ్వు లేవు’ అని పేర్కొన్నారు.

10. కరోనా అంటే భయం లేదా.. బాధ్యతారాహిత్యమా?

రెండేళ్ల క్రితం కరోనా అంటే ప్రతిఒక్కరూ భయపడేవారు. ఎంతో ఫిట్‌నెస్‌ ఉండే క్రీడాకారులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకునేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. కరోనా అంటే భయంలేకుండా పోయింది. అందరిలోనూ నిర్లక్ష్యం.. మాకేమవుతుందిలే అనే ఉదాసీనత అలవడింది. అది ఇప్పుడు టీమ్‌ఇండియా క్రికెటర్లకూ పాకింది. అందువల్లే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కరోనా బారినపడినట్లు పలువురు అంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని