Hardik Pandya: ఐర్లాండ్‌తో ఆడుతున్నామని చెప్పడం తేలికే.. అయినా.. : హార్దిక్

క్రికెట్‌లో పసికూనగా పేరున్న ఐర్లాండ్‌తో ఆడుతున్నామని చెప్పడం తేలికే అయినా టీమ్‌ఇండియా తరఫున ఆడటం పెద్ద గర్వకారణమని కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య అన్నాడు...

Published : 26 Jun 2022 12:26 IST

ఇంటర్నెట్‌డెస్క్: క్రికెట్‌లో పసికూనగా పేరున్న ఐర్లాండ్‌తో ఆడుతున్నామని చెప్పడం తేలికే అయినా టీమ్‌ఇండియా తరఫున ఆడటం పెద్ద గర్వకారణమని కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య అన్నాడు. ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌కు అతడు తొలిసారి టీమ్‌ఇండియాకు కెప్టెన్సీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత జట్టు ఈరోజు రాత్రి 9 గంటలకు డబ్లిన్‌ వేదికగా తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఈ సందర్భంగా మ్యాచ్‌కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో హార్దిక్‌ మాట్లాడాడు.

‘ఈ సిరీస్‌ మాకు మానసిక సవాలులాంటిది. మేం ఐర్లాండ్‌తో ఆడుతున్నామని చెప్పడం తేలికైన విషయమే అయినా భారత జట్టు తరఫున ఆడటం అతిపెద్ద గర్వకారణం. అలాగే మేం ఈసారి ప్రపంచకప్‌ గెలవాలంటే ఇక్కడి నుంచి ఆడే ప్రతిఆట ముఖ్యమైనదే. ప్రపంచకప్‌ లాంటి మెగా టోర్నీ అయినా.. మరే ఇతర పెద్ద సిరీస్‌ అయినా మేం ఒకే ఇంటెన్సిటీతో ఆడతాం. అలాంటిది.. ఇప్పుడు కూడా ఎంత బాగా ఆడతామన్నదే మానసికంగా ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే రెండు మ్యాచ్‌ల్లో గెలవడం అంత తేలిక కాదు. కానీ, టీమ్ఇండియాకు ఆడుతున్నాం కాబట్టి అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. అది తప్పకుండా చేస్తాం’ అని హార్దిక్‌ చెప్పుకొచ్చాడు.

మరోవైపు ఈ సిరీస్‌లో ప్రధాన ఆటగాళ్లు లేకపోయినా యువ ఆటగాళ్లతో కలిసి ఆడటంపై స్పందించిన అతడు.. ఇలాంటి అవకాశం అదృష్టమని చెప్పాడు. టీమ్‌ఇండియా ఒకేసారి రెండు జట్లను ఆడించాల్సి వస్తే.. తమ రిజర్వ్‌ బెంచ్‌ అంత బలంగా ఉండటం అదృష్టమని చెప్పాడు. దీంతో చాలా మంది యువ క్రికెటర్లకు బరిలోకి దిగి తమ సత్తా చాటే అవకాశం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. భారత్‌లో అవకాశాలు రాని ఎంతో మంది నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు ఉన్నారని, అలాంటి వారికి టీమ్‌ఇండియా తరఫున ఆడటం పెద్ద కల అని హార్దిక్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని