Updated : 26 Jun 2022 15:10 IST

Biden: అమెరికాలో తుపాకుల నియంత్రణ బిల్లుపై బైడెన్‌ సంతకం..!

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికాలో తుపాకుల నియంత్రణ చట్టంపై అధ్యక్షుడు జో బైడెన్‌ శనివారం సంతకం చేశారు.  తుపాకుల నియంత్రణకు కొన్ని దశాబ్దాల తర్వాత తీసుకొచ్చిన  అతిపెద్ద చట్టం ఇదే. బిల్లుపై సంతకాలు చేసిన తర్వాత జోబైడెన్‌ స్పందిస్తూ ‘‘ఈ చట్టం చాలా మంది ప్రాణాలను కాపాడనుంది’’ అని ప్రకటించారు. ఇటీవల టెక్సాస్‌లోని బఫెలో కాల్పుల ఘటన తర్వాత ఈ బిల్లు తెరపైకి వచ్చింది. ఈ బిల్లు శుక్రవారం ప్రతినిధుల సభలో 234-193 ఓట్ల తేడాతో  పాస్‌ అయింది.  బిల్లుకు అనుకూలంగా 14 మంది రిపబ్లికన్లు కూడా ఓటింగ్‌ చేయడం గమనార్హం. అంతకు ముందు రోజే సెనెట్‌లో ఈ బిల్లుకు ఆమోదముద్ర పడింది.

ఈ సందర్భంగా బైడెన్‌ మాట్లాడుతూ జులై 11వ తేదీన  బిల్లుకు మద్దతు పలికిన కాంగ్రెస్‌ సభ్యులు, తుపాకీ సంస్కృతి బాధితులతో కలిసి సంబరాలు జరుపుకోనున్నట్లు వెల్లడించారు. ‘‘నేను అనుకొన్న ప్రతి ఒక్కటీ ఈ బిల్లు ద్వారా సాధించలేను. కాకపోతే ప్రజల ప్రాణాలను కాపాడే నిబంధనలు దీనిలో ఉన్నాయి. ఇప్పటికి ఇది సరిపోతుంది. వాషింగ్టన్‌ ఏం చేయలేదు అని అనుకొనే సమయంలో మేము కొంత చేశాం. ఒక వేళ మేము రాజీపడి ఉంటే.. చాలా కీలక విషయాల్లో వెనక్కి తగ్గాల్సి ఉంటుంది. మాజీ సైనికుల ఆరోగ్య సమస్యలు, అమెరికా సృజనాత్మక ఆవిష్కరణలు ఇలా చాలా అంశాలపై సర్దుకుపోవాల్సి ఉంటుంది. చేయాల్సింది చాలా ఉంది.. నేను వదిలిపెట్టేది లేదు. ఇది చారిత్రకమైన రోజు’’ అని పేర్కొన్నారు.  

బిల్లులో ఏముందంటే...

* న్యూయార్క్‌, టెక్సాస్‌లలో కాల్పులు జరిపింది 18 ఏళ్ల వయసువారే. దీంతో ఇకపై 18 నుంచి 20 ఏళ్ల వయసులో తుపాకులు కొనదలిచేవారికి నేర రికార్డులు ఉన్నాయా అని ఫెడరల్‌, స్థానిక అధికారులు తనిఖీ చేసే గడువును బిల్లు పెంచింది. ఇంతవరకు తనిఖీ ప్రక్రియ మూడు రోజుల్లో పూర్తి కావలసి ఉండగా, దాన్ని పది రోజులకు పెంచారు.

* గృహ హింసకు పాల్పడినట్టు చరిత్ర ఉన్నవారు... ప్రస్తుతం భార్య లేదా ప్రియురాలితో కలసి ఉంటున్నా, లేకపోయినా తుపాకులు కొనడానికి మాత్రం అర్హులు కారు.

* ప్రమాదకర వ్యక్తుల నుంచి తాత్కాలికంగా తుపాకులను స్వాధీనం చేసుకోవడానికి అధికారులు కోర్టు ఉత్తర్వులు పొందే హక్కును కల్పిస్తూ... ఇప్పటివరకూ 19 రాష్ట్రాలు, డిస్ట్రిక్ట్స్‌ ఆఫ్‌ కొలంబియా చట్టాలు చేశాయి. ఈ ప్రక్రియకు ఫెడరల్‌ ప్రభుత్వం నిధులు సమకూర్చడానికి బిల్లు వీలు కల్పిస్తుంది.

* తుపాకుల అక్రమ రవాణాదారులకు, ఇతరుల కోసం తుపాకులు కొనేవారికి 25 ఏళ్ల వరకూ జైలు శిక్ష విధించాలని బిల్లులో ప్రతిపాదించారు. కాగా- తుపాకుల నియంత్రణ బిల్లుకు కాంగ్రెస్‌ ఆమోదం తెలిపి, తనకు పంపించిన వెంటనే ఆమోదముద్ర వేస్తానని అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు.


Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని