TS High Court: తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు

తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు బదిలీపై రానున్నారు. ఈమేరకు కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

Updated : 19 Mar 2024 01:59 IST

దిల్లీ: తెలంగాణ హైకోర్టు (Telangana High Court)కు కొత్తగా ఇద్దరు న్యాయమూర్తుల నియామకం జరిగింది. మధ్యప్రదేశ్‌ హైకోర్టు జడ్జిగా ఉన్న జస్టిస్‌ సుజయ్‌ పాల్‌, కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మౌసమీ భట్టాచార్య తెలంగాణ ఉన్నత న్యాయస్థానానికి బదిలీ అయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయమంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అను శివరామన్‌ను కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేశారు. సుప్రీంకోర్టు కొలీజియం గత నెలలో జస్టిస్‌ మౌసమీ భట్టాచార్య బదిలీకి సంబంధించి కేంద్రానికి సిఫారసు చేసింది. ఇక మధ్యప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ సుజయ్‌ పాల్‌ తనను బదిలీ చేయాలని కొలీజియానికి విన్నవించారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల ఆధారంగా వీరి బదిలీకి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.    

1967లో పశ్చిమ బెంగాల్‌లో జన్మించిన జస్టిస్‌ మౌసమీ భట్టాచార్య  1997లో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ మొదలు పెట్టారు. కోల్‌కతా, పట్నా, దిల్లీ, హైదరాబాద్‌ హైకోర్టుల్లో వాదనలు వినిపించారు. 2017 సెప్టెంబర్‌లో కోల్‌కతా హైకోర్టుకు అదనపు జడ్జిగా, 2019లో శాశ్వత జడ్జిగా నియమితులయ్యారు. జస్టిస్‌ సుజయ్‌ పాల్‌ 1990లో మధ్యప్రదేశ్‌ బార్‌ అసోసియేషన్‌లో పేరు నమోదు చేసుకున్నారు. 2011లో మధ్యప్రదేశ్‌ అదనపు జడ్జిగా, 2014లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని