Updated : 20 Jan 2021 12:06 IST

ఒక్క అధ్యక్షుడు.. ఆరు అధ్యక్ష భవనాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: మన దేశంలో రాష్ట్రపతి భవన్‌లాగే ప్రతి దేశాధినేతకు అధికారిక నివాసమంటూ ఒకటుంటుంది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ మరికొన్ని గంటల్లో ఆ దేశ అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్‌(శ్వేతసౌధం)లో అడుగుపెట్టబోతున్నారు. ప్రస్తుతం డొనాల్డ్‌ ట్రంప్‌ అందులో నివసిస్తున్నారు. అంతకుముందు బరాక్‌ ఒబామా సహా అమెరికా అధ్యక్షులుగా వ్యవహరించినవారంతా అందులోనే ఉన్నారు ఒక్క జార్జ్‌ వాషింగ్టన్‌ తప్ప. సకల సదుపాయాలుండే ఈ భవన నిర్మాణాన్ని 1792 అక్టోబర్‌లో ప్రారంభించి 1800 నవంబర్‌లోపు పూర్తి చేశారు. అమెరికా తొలి అధ్యక్షుడిగా జార్జ్‌ వాషింగ్టన్‌ 1789 నుంచి 1797 వరకు ఉన్నారు. మరి వైట్‌హౌస్‌ నిర్మాణం కాకముందు జార్జ్‌ వాషింగ్టన్‌ ఎక్కడ ఉన్నారు?ఏ భవనాన్ని అధికారిక నివాసంగా చేసుకున్నారు?

మొదట న్యూయార్క్‌..

అమెరికా స్వాతంత్ర్యం పొందిన తర్వాత ఆ దేశానికి అధ్యక్షుడిగా జార్జ్‌ వాషింగ్టన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం 1789లో అధ్యక్షబాధ్యతలు చేపట్టగానే ఆయనకంటూ ఓ అధికారిక నివాసం అవసరమైంది. దీంతో ఆయన హయాంలో ప్రభుత్వం మొత్తంగా ఆరు భవనాలను అధికారిక నివాసాలుగా మార్చింది. అయితే వాషింగ్టన్‌ మాత్రం మూడింట్లోనే నివాసం ఉన్నారు. ఏప్రిల్‌లో వాషింగ్టన్‌ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అధికారులు న్యూయార్క్‌లోని చెర్రీ స్ట్రీట్‌లో ఉన్న సామ్యూల్‌ ఓస్గూడ్‌కి చెందిన భవనం ‘ఫ్రాంక్లిన్‌ హౌస్‌’ను అధికారిక నివాసంగా ఎంపిక చేశారు. ఆగమేఘాల మీద ఆ ఇంటిని తొలి అధ్యక్ష భవనంగా మార్చేశారు.

అయితే, ఆ భవనం చిన్నగా ఉండటం.. సిబ్బంది ఉండటానికి సరిపడ స్థలం లేకపోవడంతో 1790 ఫిబ్రవరిలో అధికారిక నివాసాన్ని అక్కడి నుంచి న్యూయార్క్‌లోనే 39-41 బ్రాడ్‌వేలో ఉన్న ‘అలెగ్జాండర్‌ మాకొంబ్‌ హౌస్‌’కు మార్చారు. అయితే, అక్కడ వాషింగ్టన్‌ కేవలం కొన్ని నెలలు మాత్రమే ఉన్నారు. అదే ఏడాది మే నెలలో న్యూయార్క్‌ ప్రభుత్వం అధ్యక్షుడి కోసం ‘గవర్నమెంట్‌ హౌస్‌’ నిర్మాణం చేపట్టింది. రెండు నెలల తర్వాత అమెరికా ప్రభుత్వం రెసిడెంట్‌ యాక్ట్‌ తీసుకొచ్చింది. దీని ప్రకారం.. శాశ్వత రాజధానిని డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియా(ప్రస్తుత వాషింగ్టన్‌ డీసీ)లో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. అప్పటి వరకు పదేళ్ల కాలపరిమితితో ఫిలడెల్ఫియా తాత్కాలిక రాజధానిగా ఉండనున్నట్లు పేర్కొంది.

ఫిలడెల్ఫియాకు మకాం..

రాజధాని మార్పుతో అధ్యక్షుడు వాషింగ్టన్‌ తన నివాసాన్ని ఫిలడెల్ఫియాకు మార్చాల్సి వచ్చింది. అధ్యక్షుడి రాకతో ప్రభుత్వం అక్కడి 190 హైస్ట్రీట్‌లో వ్యాపారవేత్త రాబర్ట్‌ మొర్రీస్‌కు చెందిన భవనాన్ని అద్దెకు తీసుకొని ‘ప్రెసిడెంట్స్‌ హౌస్‌’గా మార్చేసింది. అక్కడే నవంబర్‌ 1790 నుంచి మార్చి 1797 వరకు వాషింగ్టన్‌, ఆయన కుటుంబం, సిబ్బంది ఉన్నారు. రాజధాని తరలింపులో భాగంగా ఫిలడెల్ఫియాకు వచ్చిన వాషింగ్టన్‌కు న్యూయార్క్‌లో నిర్మించిన ‘గవర్నమెంట్‌ హౌస్‌’లో నివసించే అవకాశం రాలేదు. దీంతో దాన్ని స్టేట్‌ గవర్నర్‌ అధికారిక నివాసంగా మార్చారు. కొన్నాళ్లకు ప్రభుత్వంలోని వివిధ విభాగాలకు లీజ్‌కు ఇచ్చారు. 1815లో భవనాన్ని కూల్చివేసి.. స్థలాన్ని ప్రజలకు విక్రయించారు.

1792లో ఫిలడెల్ఫియాలో ఒక శాశ్వత అధ్యక్ష భవనం నిర్మాణం చేపట్టారు. అదే సమయంలో శాశ్వత రాజధాని కాబోతున్న డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియాలో అధికారిక నివాసం ‘వైట్‌హౌస్‌’ నిర్మాణం ప్రారంభించారు. కానీ, రెండూ వాషింగ్టన్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయానికి అందుబాటులోకి రాలేదు. 1797లో వాషింగ్టన్‌ పదవీకాలం ముగియడంతో జాన్‌ ఆడమ్స్‌ అధ్యక్షుడయ్యారు. అదే ఏడాది ఫిలడెల్ఫియాలో నిర్మించిన శాశ్వత అధ్యక్ష భవన నిర్మాణం పూర్తయింది. అయితే, అందులో ఉండటానికి ఆడమ్స్‌ ఒప్పుకోలేదు. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి మే 1800 వరకు వాషింగ్టన్‌ నివసించిన ‘ప్రెసిడెంట్స్‌ హౌస్‌’లోనే ఉన్నారు. ఆ తర్వాత ‘వైట్‌హౌస్‌’లోకి వెళ్లారు. ఖాళీ అయిన ప్రెసిడెంట్‌ హౌస్‌ భవనాన్ని హోటల్‌గా మార్చారు. కొన్నాళ్లకు పెన్సిల్వేనియా యూనివర్సిటీకి విక్రయించారు. 

వైట్‌హౌస్‌లో ప్రవేశం

1800 నవంబర్‌ 1న జాన్‌ ఆడమ్స్‌ దేశాధ్యక్షుడి హోదాలో ‘వైట్‌హౌస్‌’లో అడుగుపెట్టారు. ఇందులో 132 గదులు, 35 బాత్‌రూమ్‌లు ఉన్నాయి. వంటగదిలో దాదాపు 140 మంది అతిథులకు, వెయ్యి మంది సిబ్బందికి వంటచేసే సదుపాయాలున్నాయి. 1901లో మరో అధ్యక్షుడు థియోడొర్‌ రూజ్‌వెల్ట్‌ ఈ భవనానికి ‘వైట్‌హౌస్‌’ అని నామకరణం చేశారు. అంతేకాదు, ఆయన హయాంలో భవనంలో పలు మార్పులు జరిగాయి. అంతకుముందు వరకు దీనిని ‘ప్రెసిడెంట్స్‌ ప్యాలెస్‌’, ‘ఎగ్జిక్యూటివ్‌ మాన్షన్‌’ అని పిలిచేవారు. ఇదండీ.. వైట్‌హౌస్‌కు ముందు అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వెనుకున్న కథ..!

ఇవీ చదవండి..

ఆ విశ్వాసంతోనే వెళ్లిపోతున్నా: ట్రంప్‌

ట్రంపరి స్వయంకృతం!

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని