Ashwagandha: కరోనా చికిత్సలో అశ్వగంధ.. బ్రిటన్‌లో క్లినికల్‌ ట్రయల్స్‌

కొవిడ్‌-19 నివారణలో అశ్వగంధ ఆయుర్వేద ఔషధ పాత్రపై దేశీయంగా చాలా పరిశోధనలు వెలువడ్డాయి. అయితే తొలిసారి ఈ ఔషధంపై ఓ విదేశీ సంస్థతో

Published : 02 Aug 2021 12:17 IST

కరోనా చికిత్సలో ఈ ఆయుర్వేద ఔషధ ప్రభావంపై మదింపు
విజయవంతమైతే భారత ప్రాచీన వైద్యానికి అంతర్జాతీయ గుర్తింపు


దిల్లీ: కొవిడ్‌-19 నివారణలో అశ్వగంధ ఆయుర్వేద ఔషధ పాత్రపై దేశీయంగా చాలా పరిశోధనలు వెలువడ్డాయి. అయితే తొలిసారి ఈ ఔషధంపై ఓ విదేశీ సంస్థతో కలసి కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వశాఖ అధ్యయనం చేయనుంది. బ్రిటన్‌లో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించనుంది. ఈ మేరకు మంత్రిత్వశాఖ పరిధిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయుర్వేద (ఏఐఐఏ), లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజీన్‌ అండ్‌ ట్రాపికల్‌ మెడిసన్‌ (ఎల్‌ఎస్‌హెచ్‌టీఎం) సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా యూకేలోని లండన్, లీసెస్టర్, బర్మింగ్‌హామ్‌ నగరాల్లో రెండు వేల మంది కరోనా రోగులపై క్లినికల్‌ ట్రయల్స్‌ జరపనున్నారు. ప్రాచీన ఆయుర్వేదంలో అశ్వగంధకు చాలా ప్రాముఖ్యత ఉంది. రోగనిరోధక శక్తి పెరగడానికి, ఆందోళన, కుంగుబాటు నివారించడానికి ఈ ఔషధం పనిచేస్తుందన్న పేరు ఉంది. దౌత్య, ఇతర మార్గాల్లో 16 నెలల పాటు 100 సమావేశాలు జరిగిన తర్వాత ఈ ఒప్పందం కుదిరిందని ఏఐఐఏ డైరెక్టర్‌ తనూజ మనోజ్‌ నేసరి తెలిపారు. ‘‘మూడు నెలలపాటు ఒక గ్రూపులోని 1,000 మందికి అశ్వగంధ మాత్రలను అందిస్తాం. మరో వెయ్యి మందికి అశ్వగంధ తరహాలోనే ఉండే ప్లేసిబో(ప్రభావం లేని మందు) మాత్రలను అందిస్తాం. తాము ఏ మాత్రలను తీసుకుంటున్నామో ఇందులో పాల్గొన్న వారికే కాకుండా.. వారిని పరిశీలించే వైద్యులకు కూడా తెలియదు. వారంతా 500మిల్లీగ్రాముల మాత్రలను రోజుకు రెండు సార్లు చొప్పున తీసుకుంటారు. అనంతరం వీరి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరిశీలిస్తారు’’ అని తనూజ తెలిపారు. ఈ క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతమైతే అశ్వగంధ ఔషధానికి అంతర్జాతీయ గుర్తింపు రానుంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని