90% కరోనా విజేతల్లో ఊపిరితిత్తుల సమస్యలు

కరోనా నుంచి కోలుకున్న చాలామందిలో ఆ తర్వాత కూడా ఊపిరితిత్తుల సమస్యలు ఎదురవుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది! చైనాలోని వుహాన్‌ ఆసుపత్రిలో కోలుకున్న కరోనా బాధితుల్లో..

Updated : 06 Aug 2020 08:40 IST

వుహాన్‌ వర్సిటీ నిపుణుల పరిశోధనలో వెల్లడి

బీజింగ్‌: కరోనా నుంచి కోలుకున్న చాలామందిలో ఆ తర్వాత కూడా ఊపిరితిత్తుల సమస్యలు ఎదురవుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది! చైనాలోని వుహాన్‌ ఆసుపత్రిలో కోలుకున్న కరోనా బాధితుల్లో 90% మంది ఈ సమస్యను ఎదుర్కొన్నారని, వారిలో 5% మంది తిరిగి క్వారంటైన్‌లోకి వెళ్లాల్సి వచ్చిందని పేర్కొంది. వుహాన్‌ యూనివర్సిటీకి చెందిన జాంగ్‌హాన్‌ ఆసుపత్రి వైద్య నిపుణుల బృందం ఈ అధ్యయనం చేపట్టింది. కొవిడ్‌ నుంచి కోలుకున్న పలువురికి వీరు వైద్య పరీక్షలు నిర్వహించగా, 90% మందిలో ఊపిరితిత్తులు దెబ్బతినే ఉన్నాయని, సంపూర్ణ ఆరోగ్యవంతుల మాదిరి అవి పనిచేయలేదని తెలిసింది. ‘‘కరోనా విజేతల ఊపిరితిత్తుల్లో వాయు ప్రసరణ, గ్యాస్‌ ఎక్స్ఛేంజ్‌ విధులు సక్రమంగా జరగడంలేదని గుర్తించాం. వారిని ఆరు నిమిషాలపాటు నడిపించగా, సగటున 400 మీటర్లు మాత్రమే నడవగలిగారు. ఆరోగ్యవంతులైతే అదే సమయంలో 500 మీటర్లు నడుస్తారు. కోలుకున్నవారిలో బి-కణాలు తక్కువ స్థాయిలో ఉన్నాయి. అంటే వీరి రోగనిరోధక వ్యవస్థ ఇంకా కుదుటపడలేదన్నమాట. అంతేకాదు. ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయినవారిలో కొందరు మూడు నెలలపాటు ఆక్సిజన్‌ యంత్రాలపై ఉండాల్సి వచ్చింది. 10% మందిలో కరోనా యాంటీబాడీలు కనుమరుగైపోయాయి కూడా! పైగా 5% మందికి న్యూక్లియిక్‌ యాసిడ్‌ టెస్ట్‌లో నెగెటివ్‌ వచ్చినా, ఇమ్యునోగ్లోబులిన్‌-ఎం పరీక్షలో పాజిటివ్‌ వచ్చింది. వీరికి కరోనా రెండోసారి సోకిందా అన్నది మాత్రం స్పష్టం కాలేదు. కరోనాను జయించిన చాలామంది కుంగుబాటుకు గురవుతున్నారు. వారితో కలిసి భోజనం చేసేందుకు కుటుంబ సభ్యులు సైతం విముఖత చూపుతున్నారు’’ అని అధ్యయనకర్త పెంగ్‌ జియాంగ్‌ వివరించారు. ఇందుకు సంబంధించిన వివరాలను గ్లోబల్‌-టైమ్స్‌ అందించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని