Taliban Rule: తాలిబన్ల పాలనను ఇప్పట్లో గుర్తించేది లేదు: అమెరికా

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్‌ పాలనను అమెరికా ఇప్పట్లో అధికారికంగా గుర్తించే ప్రసక్తే లేదని శ్వేతసౌధం స్పష్టం చేసింది. అమెరికా మిత్రదేశాలు సైతం ఇదే బాటలో పయనించే అవకాశం ఉందని తెలిపింది. అలాగే బలగాల ఉపసంహరణ తర్వాత దౌత్యకార్యాలయాలను ఉంచాలో.. లేదో....

Updated : 28 Aug 2021 14:58 IST

వాషింగ్టన్‌: అఫ్గానిస్థాన్‌లో తాలిబన్‌ పాలనను అమెరికా ఇప్పట్లో అధికారికంగా గుర్తించే ప్రసక్తే లేదని శ్వేతసౌధం స్పష్టం చేసింది. అమెరికా మిత్రదేశాలు సైతం ఇదే బాటలో పయనించే అవకాశం ఉందని తెలిపింది. అలాగే బలగాల ఉపసంహరణ తర్వాత దౌత్యకార్యాలయాలను ఉంచాలో.. లేదో ఇంకా నిర్ణయించలేదని పేర్కొంది.

‘‘అమెరికా గానీ, మా మిత్రదేశాలు గానీ.. తాలిబన్‌ పాలనను గుర్తించేందుకు అంత తొందరేం లేదు’’ అని శ్వేతసౌధం అధికారిక ప్రతినిధి జెన్‌ సాకి శుక్రవారం తెలిపారు. అలాగే తాలిబన్‌ ప్రభుత్వానికి అధికారిక గుర్తింపునివ్వాలంటే వారు కొన్ని హామీలు ఇవ్వాల్సి ఉంటుందని అమెరికా గతంలోనే స్పష్టం చేసింది. ఉగ్రమూకలకు అఫ్గాన్‌ను కేంద్రంగా మార్చొద్దని తేల్చి చెప్పింది. మానవ హక్కులు, ముఖ్యంగా మహిళల స్వేచ్ఛకు భంగం వాటిల్లొద్దని షరతు విధించింది.

కాబుల్‌లో అమెరికా దౌత్య కార్యాలయాలను ఉంచాలని తాలిబన్‌ కోరినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ తెలిపారు. కానీ, అమెరికా ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. అమెరికా పౌరుల రక్షణే తమ తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. అమెరికన్ల భద్రతకు తాలిబన్లు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కానీ, అవన్నీ ఇంకా మాటల రూపంలోనే ఉన్నాయని.. వాటిని చేతల్లో పెట్టినప్పుడే తమ విశ్వాసం బలపడుతుందని తేల్చి చెప్పారు. తాలిబన్ల నుంచి తాము మరింత భరోసాను ఆశిస్తున్నామన్నారు.

ఆగస్టు 15న తాలిబన్లు అఫ్గాన్‌ను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్న తర్వాత అక్కడే ఉన్న అమెరికా దౌత్య అధికారులంతా కాబుల్‌ విమానాశ్రయానికి తరలివెళ్లారు. అఫ్గాన్ గడ్డ నుంచి తరలింపు కార్యక్రమం ఇంకా కొనసాగుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని