Qatar Supports Afghan: అఫ్గాన్‌కు కతర్‌ అండ

కొన్ని రోజులుగా అఫ్గానిస్థాన్‌ పేరు ప్రపంచ వ్యాప్తంగా ఎంతగా మారుమోగింతో...

Published : 31 Aug 2021 09:41 IST

తరలింపుల్లో కీలకంగా వ్యవహరించిన గల్ఫ్‌-అరబ్‌ దేశం
అమెరికా-తాలిబన్‌లతో సఖ్యతే కారణం

దుబాయ్‌: కొన్ని రోజులుగా అఫ్గానిస్థాన్‌ పేరు ప్రపంచ వ్యాప్తంగా ఎంతగా మారుమోగింతో... కతర్‌ పేరూ అంతే ప్రాధాన్యం సంతరించుకొంది. తాలిబన్లు అఫ్గాన్‌ను ఆక్రమించిన క్రమంలో- ఆ దేశ రాజధాని కాబుల్‌ నుంచి ప్రజలను తరలించే విషయంలో ఈ బుల్లి గల్ఫ్‌ అరబ్‌ దేశం పోషించిన పాత్ర అలాంటిది మరి! తాలిబన్లతో కుదిరిన ఒప్పందం ప్రకారం, అఫ్గాన్‌ నుంచి తన దళాలను ఆగస్టు 31 నాటికి పూర్తిగా ఉపసంహరించుకోవాలని అమెరికా నిర్ణయించింది. ఇంతలోనే తాలిబన్లు అఫ్గాన్‌ను ఆక్రమించారు. దీంతో వారు ఎప్పుడు ఏ హాని తలపెడతారోనన్న భయం అలుముకొంది. అమెరికా తన పౌరులతోపాటు విదేశీయులను, నాటో దళాలకు సహకరించిన అఫ్గాన్లను వీలైనంత త్వరగా విమానాల్లో తరలించేందుకు చర్యలు చేపట్టింది. కాబుల్‌ నుంచి జనాన్ని తీసుకెళ్లే విదేశీ విమానాలు తన భూభాగంలో దిగేందుకు కతర్‌ అనుమతిచ్చి, తలలో నాలుకలా వ్యవహరించింది. అఫ్గాన్‌ శరణార్థులకూ ఆశ్రయమిచ్చింది. ఆగస్టు 14 నుంచి తాము 1.13 లక్షల మందిని తరలించినట్టు అమెరికా చెబుతుండగా, వారిలో 43 వేల మందికి పైగా తమ దేశంలో దిగి వెళ్లినట్టు కతర్‌ వెల్లడించింది. మొత్తంగా తరలింపుల్లో 40% తమ దేశం మీదుగానే జరిగినట్టు పేర్కొంది.

31 తర్వాత ఏంటి?

అఫ్గాన్‌ నుంచి అమెరికా దళాల పూర్తిస్థాయి ఉపసంహరణ మంగళవారంతో పూర్తవుతుంది. దీంతో భవిష్యత్తులో అఫ్గాన్‌ విషయంలో సమన్వయంతో కలిసి ముందుకు వెళ్లే అంశంపై అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ ప్రపంచ దేశాల నాయకులతో వీడియో ద్వారా మాట్లాడనున్నారు. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, టర్కీ, నాటో, యూరోపియన్‌ యూనియన్‌లు పాల్గొనే ఈ సమావేశంలో... ప్రధాన ఆకర్షణగా నిలిచేది మాత్రం కతరే! అఫ్గాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లు, కాబుల్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహించే విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారు. నిర్వహణ బాధ్యత చేపట్టాలని ఇప్పటికే టర్కీ రాయబారులను కోరారు. అయితే... దేశ పాలనలో స్పష్టత వచ్చాకే ఈ అంశాన్ని పరిశీలిస్తామని టర్కీ సర్కారు తేల్చి చెప్పింది. దీంతో తాలిబన్లు కతర్‌ వైపు చూశారు. అమెరికా బలగాల ఉపసంహరణ తర్వాత... కాబుల్‌ విమానాశ్రయ నిర్వహణకు అవసరమైన పౌర సాంకేతికతను అందించే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు కతర్‌ విదేశాంగశాఖ సోమవారం ధ్రువీకరించింది. విమానాశ్రయ కార్యకలాపాల నిర్వహణతో పాటు.. అక్కడి భద్రతను పర్యవేక్షించేందుకు కూడా తాము ప్రాధాన్యమిస్తున్నట్టు తెలిపింది.

శాంతి ఒప్పందానికి వేదికై...

అమెరికా-తాలిబన్‌ శాంతి ఒప్పందానికి కతర్‌ వేదికగా నిలిచింది. ఇప్పుడు ప్రపంచ దేశాలు దీని వైపు చూస్తున్నాయి. అఫ్గాన్‌కు సాయం అందజేతలో తోడ్పాటు అందించాలని కోరుతున్నాయి.

పెరిగిన పలుకుబడి: లోల్వా

అంతర్జాతీయంగా కతర్‌ రాజకీయ పలుకుబడి పెరిగిన విషయం నిజమేనని ఆ దేశ విదేశాంగ సహాయ మంత్రి లోల్వా అల్‌-ఖాçర్‌ చెప్పారు. అయితే, ఇదంతా రాజకీయ ప్రయోజనాల కోసమే చేశామనుకోవడం పెద్ద పొరపాటే అవుతుందన్నారు. ‘‘అఫ్గాన్‌లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అందరికీ తెలుసు. అక్కడున్న మా ప్రజలు కూడా నిద్రల్లేని రాత్రులు గడిపారు. మా దేశానికి తరలివచ్చిన ఎంతోమంది గర్భిణులు, చిన్నారులను కంటికి రెప్పలా చూసుకోవాల్సి వచ్చింది. ఇదేమీ చిన్న విషయం కాదు. ప్రజా సంబంధాలను ఉపయోగించి పేరు సంపాదించుకోవచ్చు. కానీ, క్షేత్రస్థాయిలో మా సైనికులు చాలా కష్టపడ్డారు. ప్రాణాలకు తెగించి కాబుల్‌ నుంచి తరలింపులు చేపట్టారు. ఇది తాలిబన్లకు ఫోన్‌చేస్తే అయిపోయే పనికాదు. అమెరికా, బ్రిటన్, నాటో, టర్కీ చెక్‌పోస్టులను దాటుకుని తరలింపులు చేపట్టాల్సి వచ్చింది’’ అని లోల్వా పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని