అలర్జీ ఉంటే..టీకా తీసుకోకండి

మంగళవారం నుంచి బ్రిటన్‌లో ఫైజర్‌/ బయోఎన్‌టెక్ సంయుక్తంగా రూపొందించిన టీకాను ప్రజలకు అందజేస్తున్న సంగతి తెలిసిందే.

Published : 10 Dec 2020 12:16 IST

ప్రజలకు సూచించిన యూకే ప్రభుత్వం

లండన్‌: ఫైజర్‌-బయోఎన్‌టెక్ సంయుక్తంగా రూపొందించిన టీకాను మంగళవారం నుంచి బ్రిటన్‌ ప్రజలకు అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొందరిలో తీవ్ర అలర్జీ లక్షణాలు కనిపించాయి. దీంతో గతంలో ఏదైనా ఔషధం, ఆహారం, టీకా వాడినప్పుడు అలర్జీ లాంటిదేమైనా వస్తే అటువంటి వారు ఫైజర్ టీకాకు దూరంగా ఉండాలని బ్రిటన్‌ ఔషధ నియంత్రణ సంస్థ హెచ్చరించింది. బ్రిటన్‌ తొలుత ఈ టీకాను ఆరోగ్య సిబ్బంది, 80 ఏళ్ల వయసు పైబడినవారితో పాటు కేర్ హోమ్‌ వర్కర్లకు అందిస్తోంది. 

కాగా, ప్రజలకు టీకా పంపిణీ ప్రారంభమైన దగ్గరి నుంచి తీవ్రమైన అలర్జీ(అనాఫిలాక్సిస్‌)కి గురైన రెండు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇంకోటి కూడా దాదాపు అలాంటి సంఘటననే అధికారులు గుర్తించారని ఔషధ నియంత్రణ సంస్థ వెల్లడించింది. ‘గతంలో  ఏదైనా ఔషధం, ఆహారం, టీకా వాడినప్పుడు అలర్జీ లాంటిదేమైనా వస్తే అటువంటి వారు ఫైజర్ టీకాకు దూరంగా ఉండాలి. చాలా మందికి ఈ పరిస్థితి ఎదురుకాదు. కొవిడ్-19 నుంచి ప్రజలను రక్షించడంలో ఈ టీకా ప్రయోజనాలు.. ప్రమాదాలను అధిగమిస్తాయి. దీని భద్రత, నాణ్యత, ప్రభావం.. ప్రమాణాలకు అనుగుణంగా ఉందని విశ్వసించవచ్చు’ అని ఔషధ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జూన్‌ రెయిన్ ఓ ప్రకటనలో వెల్లడించారు. 

శరీర రోగ నిరోధక శక్తి అతిగా స్పందించడాన్ని అనాఫిలాక్సిస్‌గా చెప్తారు. ఇది కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారవచ్చని నిపుణులు వెల్లడించారు. దాంతో నిపుణులను సంప్రదించిన తరవాత అలెర్జీ ప్రతిచర్యలు తీవ్రంగా ఉన్నవారు ఈ టీకా డోసును తీసుకోవద్దని ఔషధ సంస్థ సూచించింది. కాగా, దీనిపై తాము దర్యాప్తుకు సహకరిస్తామని ఫైజర్ సంస్థ ప్రకటించింది. మరోవైపు, అమెరికాకు చెందిన ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ), ఐరోపా ఔషధాల సంస్థ(ఈఎంఏ) ఈ డేటాను విశ్లేషిస్తున్నాయి. 

బ్రిటన్‌లో వెలుగుచూసిన ఘటనలను దృష్టిలో ఉంచుకొని.. తీవ్రమైన అలర్జీ సమస్యలున్న అమెరికన్లు ఫైజర్ టీకాను తీసుకునేవారి జాబితాలో ఉండకపోవచ్చని అక్కడి ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఆ దేశంలో వెలుగుచూసిన ప్రతికూల చర్యలను పరిశీలిస్తున్నామని కెనడా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇదిలా ఉండగా..భారత్‌లో అత్యవసర వినియోగం కోసం ఇప్పటికే భారత్‌ బయోటెక్‌, సీరం సంస్థలతో పాటు ఫైజర్‌ కూడా దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై డీసీజీఐ సమీక్ష జరిపి రెండు వారాల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు వార్తలు వచ్చాయి. 

ఇవీ చదవండి:

ఐదు రోజులుగా 500 లోపే మరణాలు

ఆకలి తీర్చుకునేందుకు అప్పులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని