Air India: వంతెన కింద విమానం ఇరుక్కుపోవడం వెనుక అసలు కథ ఇదీ..!

వంతెనల కింద భారీ లారీలు, ట్రక్కులు చిక్కుకోవడం మనం సహజంగా చూస్తూనే ఉంటాం. అయితే, గాలిలో ఎగిరే విమానం బ్రిడ్జి కింద ఇరుక్కుపోవడం మాత్రం ఎవరూ చూసి ఉండరు కదా.......

Published : 07 Oct 2021 01:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వంతెనల కింద భారీ లారీలు, ట్రక్కులు చిక్కుకోవడం మనం సహజంగా చూస్తూనే ఉంటాం. అయితే, గాలిలో ఎగిరే విమానం బ్రిడ్జి కింద ఇరుక్కుపోవడం మాత్రం ఎవరూ చూసి ఉండరు కదా. అందుకే దిల్లీలో రన్‌వేపై ఉండాల్సిన విమానం రోడ్డుపైకి వచ్చిన తాజా వీడియో ఒకటి ఇటీవల సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరలైన విషయం తెలిసిందే. అసలు ఆకాశంలో విహరించాల్సిన విమానం రోడ్డుపైకి ఎలా వచ్చింది? దీని వెనుక ఉన్న అసలు కథేంటంటే..! 

వంతెన కింద విమానం ఇరుక్కుపోయిన ఘటన ఇటీవల దిల్లీ-గుర్గావ్‌ రహదారిలోని ఇందిరాగాంధీ విమానాశ్రయం సమీపంలో చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఎయిరిండియాకు చెందిన ఈ పాత విమానాన్ని ఓ హోటల్‌ నిర్వాహకులు కొనుగోలు చేసి విమానాశ్రయం నుంచి తీసుకెళ్తున్న సమయంలో ఈ ఆసక్తికర ఘటన జరిగింది.  విమానం ఎత్తు, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి ఎత్తును సరిగా అంచనా వేయకపోవడం వల్ల విమానం కాస్త ముందుకు వెళ్లిన తర్వాత మధ్య భాగం ఆ బ్రిడ్జికి తగలడంతో ఇరుక్కుంది. అయితే, ఈ సమయంలో విమానానికి ఎలాంటి నష్టం జరగలేదు. రెండు, మూడు నిమిషాల వ్యవధిలోనే ఈ విమానం కొనుగోలు చేసిన నిర్వాహకులు సురక్షితంగా దాన్ని తరలించారు.

రెండు, మూడు నిమిషాల పాటు ఆగింది అంతే..!

ఎయిరిండియా నుంచి ఈ పాత విమానం కొనుగోలు చేసిన వ్యక్తి దీనిపై వివరణ ఇచ్చారు. ‘‘సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన విమానం ఇదే. వంతెన దాటుతున్న సమయంలో అక్కడ ఈ విమానం రెండు, మూడు నిమిషాల పాటు ఆగింది..దాంతో ఒక్కసారిగా వీడియో వైరల్‌ అయింది. కాలం చెల్లిన విమానాలను కొనుగోలు చేసి  రెస్టారంట్లుగా మారుస్తుంటాం. రెస్టారంట్ల విస్తరణలో భాగంగా ఈ విమానం తీసుకున్నాం. మన దేశంలోని ప్రజలంతా విమానంలో ప్రయాణించలేకపోవచ్చు. అలాంటివారికి కనీసం విమానంలో భోజనం చేసిన అనుభూతిని అందించాలనుకుంటున్నాం. అందుకే దేశవ్యాప్తంగా ఇలాంటి రెస్టారంట్లు ఏర్పాటు చేస్తున్నాం’’ అని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని