India Corona: ముప్పు పొంచి ఉన్న కాంటాక్ట్‌లతో సహా వారికీ కరోనా పరీక్షలు

దేశంలో కరోనా కేసుల్లో భారీ పెరుగుదల ఉందని బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో ముప్పు పొంచి ఉన్న వారితో సహా లక్షణాలు కనిపిస్తోన్న కాంటాక్ట్‌లకు పరీక్షలు చేయాల్సి ఉందని స్పష్టంచేసింది.

Published : 12 Jan 2022 23:16 IST

స్వల్ప లక్షణాలు ఉన్నవాళ్లు ఏడు రోజుల్లోనే డిశ్చార్జ్‌ కావొచ్చు: కేంద్రం

దిల్లీ: దేశంలో కరోనా కేసుల్లో భారీ పెరుగుదల ఉందని బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో ముప్పు పొంచి ఉన్న వారితో సహా లక్షణాలు కనిపిస్తోన్న కాంటాక్ట్‌లకు పరీక్షలు చేయాల్సి ఉందని స్పష్టం చేసింది. స్వల్ప స్థాయి లక్షణాలు ఉన్న వ్యక్తులను పాజిటివ్‌గా తేలిన ఏడు రోజుల్లోనే డిశ్చార్జి చేయొచ్చని, మళ్లీ పరీక్ష అవసరం లేదని పేర్కొంది. బుధవారం దేశంలో నెలకొన్న కొవిడ్ పరిస్థితుల గురించి కేంద్ర ఆరోగ్య శాఖ మీడియాకు వివరించింది. 

ఈ రాష్ట్రాల్లో ఆందోళనకరంగా వైరస్ విజృంభణ..

మహారాష్ట్ర, పశ్చిమ్ బెంగాల్‌, దిల్లీ, తమిళనాడు, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్‌, కేరళ, గుజరాత్‌లో వైరస్‌ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోందని ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ అన్నారు. ఈ రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు భారీగా నమోదవుతోందని చెప్పారు. బెంగాల్‌లో 32.18శాతం, దిల్లీలో 23.1 శాతం, మహారాష్ట్రలో 22.39 శాతంగా ఉందని వెల్లడించారు. దేశంలో క్రియాశీల కేసులు 9.5 లక్షలకు చేరాయని హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. ప్రపంచ వ్యాప్తంగా 159 దేశాల్లో వైరస్ ఉద్ధృతి చూపిస్తోందని కేంద్రం పేర్కొంది. అలాగే ఐరోపాలోని 8 దేశాల్లో రెండు వారాల వ్యవధిలో కొత్త కేసులు రెండు రెట్ల కంటే ఎక్కువగా నమోదయ్యాయని తెలిపింది.

ముప్పు పొంచి ఉన్న కాంటాక్ట్‌లతో సహా వారికి పరీక్షలు..

ముప్పు పొంచి ఉన్న వారితో సహా లక్షణాలు కనిపిస్తోన్న వ్యక్తులకు పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని ఐసీఎంఆర్ డీజీ బలరాం భార్గవ అన్నారు. ఎక్కువ ప్రమాదం పొంచి ఉన్న వారికి మినహా లక్షణాలు లేని కాంటాక్ట్‌లకు పరీక్షలు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. కొవిడ్ మార్గదర్శకాల ప్రకారం పాజిటివ్‌ వ్యక్తులతో సన్నిహితంగా ఉన్న ప్రతి ఒక్కరూ 7 రోజలు పాటు క్వారంటైన్‌లో ఉండాలని చెప్పారు. అలాగే తేలికపాటి కొవిడ్ లక్షణాలు ఉన్న వ్యక్తులను పాజిటివ్‌గా తేలిన ఏడు రోజుల్లోనే డిశ్చార్జ్‌ చేయొచ్చని, మళ్లీ పరీక్షలు అవసరం లేదని ఆరోగ్య శాఖ తెలిపింది. 

ప్రపంచ వ్యాప్తంగా 115 ఒమిక్రాన్ మరణాలు..

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 115 ఒమిక్రాన్ మరణాలు సంభవించాయి. భారత్‌లో కూడా ఈ వేరియంట్ వల్ల ఒకరు మృతి చెందారు. దక్షిణాఫ్రికా, యూకే, కెనడా, డెన్మార్క్‌ నుంచి వచ్చిన వివరాల ప్రకారం డెల్టాతో పోల్చుకుంటే ఒమిక్రాన్‌తో ఆసుపత్రిలో చేరే రేటు తక్కువగా ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే ఒమిక్రాన్ సాధారణ జలుబు కాదని, వైరస్ తీవ్రతను తగ్గించడానికి అర్హులంతా టీకా తీసుకోవాలని వెల్లడించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని