Manipur: మణిపుర్‌లో మళ్లీ హింస.. ఇళ్లకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు

మణిపుర్‌(Manipur) మరోసారి హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు ఇళ్లకు నిప్పటించడంతో.. ఇళ్లల్లో చిక్కుకున్నవారిని కాపాడేందుకు అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. 

Updated : 22 May 2023 18:57 IST

ఇంఫాల్‌: మణిపుర్‌(Manipur)లో మరోసారి ఘర్షణలు చెలరేగాయి. గత నెల భగ్గుమన్న ఆ రాష్ట్రం.. భద్రతా బలగాల మోహరింపు, పెట్రోలింగ్ వంటి చర్యలతో ఇన్నిరోజులు నివురుగప్పిన నిప్పులా ఉంది. తాజాగా స్థలం విషయంలో మెయిటీ, కుకీ తెగల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. రాజధాని ఇంఫాల్‌లోని న్యూ చెకాన్‌ ప్రాంతంలో పలు ఇళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. దాంతో వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం.. భద్రతా బలగాలను మోహరించింది. మంటలు అంటుకున్న ఇళ్లల్లో చిక్కుకున్నవారిని కాపాడేందుకు సహాయక చర్యలు ప్రారంభించింది. హింసాత్మక ఘటనలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించకుండా కర్ఫ్యూ విధించింది. ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. 

మణిపుర్‌(Manipur)లో ప్రస్తుతం చెలరేగిన అల్లర్లకు మూలం కొన్ని దశాబ్దాలుగా ఇక్కడి జాతుల మధ్య నెలకొన్న వైరమే కారణం.  రాష్ట్రంలో మెజారిటీలుగా ఉన్న మెయిటీలకు గిరిజనుల(ఎస్టీ) హోదా కట్టబెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై గిరిజన సంస్థలు ఆందోళనలను ఉద్ధృతం చేశాయి. అవి నిర్వహించిన సంఘీభావయాత్ర హింసాత్మక ఘటనలకు దారితీసింది. కొన్నిరోజుల పాటు రాష్ట్రం మండిపోయింది. ఆ ఘటనల్లో దాదాపు 70 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆర్మీ, పారామిలిటరీ, పోలీసులను మోహరించి, కొద్దిరోజుల తర్వాత పరిస్థితిని అదుపులోకి తేగలిగారు. కానీ మళ్లీ అక్కడి వాతావరణం మొదటికొచ్చేలా కనిపిస్తోంది.

ఇంతకుముందు మణిపుర్‌ (Manipur)లో రెండో అతిపెద్ద పట్టణమైన చురాచాంద్‌పుర్‌ ఈ ఘర్షణలకు కేంద్ర బిందువుగా మారింది. కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ (N.Biren Singh) పాల్గొనాల్సిన సభావేదికను ఆ ప్రాంతంలో నిరసనకారులు దహనం చేసిన సంగతి తెలిసిందే. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు