Covid: అప్రమత్తంగా ఉండండి.. రాజకీయం చేయొద్దు: కొవిడ్ వ్యాప్తిపై రాష్ట్రాలకు కేంద్రం సూచన

Covid: జేన్‌.1 సబ్‌వేరియంట్‌ (JN.1 variant) వ్యాప్తిపై రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అయితే, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.

Updated : 20 Dec 2023 12:27 IST

దిల్లీ: జేఎన్‌.1 సబ్‌ వేరియంట్‌ (JN.1 variant) కారణంగా దేశంలో కొవిడ్‌ (Covid) కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్‌ వ్యాప్తి నియంత్రణ, ఆసుపత్రుల సన్నద్ధతపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ (Mansukh Mandaviya) బుధవారం రాష్ట్రాల అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన కీలక సూచనలు చేశారు. ప్రతి మూడు నెలలకోసారి ఆసుపత్రుల్లో మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలని సూచించారు.

‘‘మనమంతా సమష్టిగా పనిచేయాల్సిన సమయమిది. మళ్లీ కొవిడ్‌ వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ, అప్రమత్తంగా ఉండాలి. ఆసుపత్రుల సన్నద్ధత, వైరస్‌ వ్యాప్తిని నిరోధించడం, ప్రజలకు అవగాహన కల్పించడంపై మనం సిద్ధంగా ఉండాలి. ఆసుపత్రుల్లో ప్రతి మూడు నెలలకోసారి మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలి. ఆరోగ్యపరమైన అంశాలను రాజకీయం చేయొద్దు. రాష్ట్రాలకు కేంద్రం పూర్తిగా సహకరిస్తుంది’’ అని కేంద్రమంత్రి మాండవీయ తెలిపారు. పండగ సీజన్‌తో పాటు చలి కాలం నేపథ్యంలో వైరస్‌ వ్యాపించకుండా నియంత్రణ చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలను ఆయన కోరారు.

Covid 19: జేఎన్‌ 1 ప్రభావం తక్కువే: డబ్ల్యూహెచ్‌వో

దేశంలో గత కొన్ని రోజులుగా మళ్లీ కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దీనికి కొవిడ్-19 ఉపరకం జేఎన్‌.1 (COVID subvariant JN.1) కారణమని గుర్తించారు. దీంతో ఇటీవల అన్ని రాష్ట్రాలకు కేంద్రం లేఖలు రాసింది. వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రజలు మార్గదర్శకాలు పాటించాలని కోరింది. రాష్ట్రాల్లో కొవిడ్‌ పరీక్షలను పెంచాలని అధికారులను సూచించింది.

అయితే, ఈ జేన్‌.1 వేరియంట్‌పై భయపడాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వెల్లడించింది. ఇది ప్రజల ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపించదని తెలిపింది. దీన్ని ‘వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌’గా వర్గీకరించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు జేఎన్‌.1తోపాటు ఇతర వేరియంట్ల నుంచి కూడా రక్షణ కల్పిస్తాయని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని