TMC: మా ఎంపీలు, మంత్రులపై దిల్లీ పోలీసులు చేయి చేసుకున్నారు: తృణమూల్‌ కాంగ్రెస్‌

దిల్లీలో ధర్నా చేస్తోన్న తమ ఎంపీలు, నేతలపై దిల్లీ పోలీసులు దారుణంగా ప్రవర్తించారని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. 

Published : 04 Oct 2023 01:52 IST

దిల్లీ: ఉపాధి హామీ, పీఎం ఆవాస్‌ యోజన పథకాల కింద పశ్చిమబెంగాల్‌కు రావాల్సిన రూ. 15వేల కోట్ల నిధుల్ని కేంద్రం విడుదల చేయాలంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ గత కొన్నిరోజులుగా డిమాండ్‌ చేస్తోంది. ఈ క్రమంలో గాంధీ జయంతి సందర్భంగా సోమవారం నుంచి ఆ పార్టీ ఎంపీలు, మంత్రులు, పార్టీ శ్రేణులు దిల్లీలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కాగా.. వారి ధర్నాను మంగళవారం రాత్రి  పోలీసులు భగ్నం చేశారు. ఆందోళన చేస్తోన్న ఎంపీలు, మంత్రులను  అరెస్టు చేసి లాక్కెళ్లారు. తమ పార్టీ నేతలపై పోలీసులు దారుణంగా ప్రవర్తించారని, మహిళా నాయకులపైనా చేయి చేసుకొని లాక్కెళ్లారని టీఎంసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

తృణమూల్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ అభిషేక్‌ బెనర్జీ నేతృత్వంలో పార్టీ నేతలు దేశ రాజధానిలో ధర్నా చేపట్టారు. మంగళవారం జంతర్‌మంతర్‌ నుంచి ర్యాలీగా కృషిభవన్‌లోని గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయం చేరుకొని, అక్కడ కేంద్ర సహాయ మంత్రి సాధ్వి నిరంజన్‌ జ్యోతితో భేటీ అయ్యేందుకు అనుమతి తీసుకున్నారు. అయితే, గంటన్నరపాటు వేచి చూసినా తమను కలిసేందుకు కేంద్రమంత్రి నిరాకరించిందని టీఎంసీ నేతలు ఆరోపిస్తూ అక్కడే ధర్నాకు దిగారు. మంత్రిని కలిసే వరకు అక్కడి నుంచే వెళ్లేది లేదని స్పష్టం చేశారు. రాత్రి 9 దాటినా ఆందోళన విరమించకపోవడంతో పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. శాంతియుతంగా ధర్నా చేస్తోన్న మా నేతల పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారంటూ.. దానికి సంబంధించిన వీడియోను తృణమూల్‌ కాంగ్రెస్‌ సోషల్ మీడియాలో షేర్‌ చేసింది.

మరోవైపు తను తృణమూల్‌ పార్టీ నేతలను కలిసేందుకు సాయంత్రం 6.30గంటల వరకు వేచి చూశానని, అయినా వారు కలవలేదని కేంద్రమంత్రి నిరంజన్‌ జ్యోతి తెలిపారు. వారి వల్ల 2.30గంటల సమయం వృథా అయిందన్నారు. సమస్యను పరిష్కరించడం కోసం కాదు.. రాజకీయాలు చేసేందుకే వారు ఇదంతా చేస్తున్నారంటూ ఆమె ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్ట్‌ చేశారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని