Bengaluru: రోజుకు 50 కోట్ల లీటర్ల నీటి కొరత.. బెంగళూరు కష్టాలపై కర్ణాటక సీఎం

బెంగళూరులో రోజుకు 2600 ఎంఎల్‌డీ (మిలియన్‌ లీటర్స్‌ పర్‌ డే) నీటి అవసరం ఉండగా.. దాదాపు 500 ఎంఎల్‌డీ కొరత ఉందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు.

Published : 19 Mar 2024 00:56 IST

బెంగళూరు: కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengaluru)లో నీటి సంక్షోభం నెలకొంది. రోజుకు 2600 ఎంఎల్‌డీ (మిలియన్‌ లీటర్స్‌ పర్‌ డే) నీటి అవసరం ఉండగా.. దాదాపు 500 ఎంఎల్‌డీ కొరత ఉందని సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) వెల్లడించారు. ఈ వ్యవహారంపై సోమవారం అధికారులతో సమావేశమైన ఆయన.. సమస్య పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. తాగునీటి సరఫరాకు నిధుల కొరత లేదని, భవిష్యత్తులో ఈ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకునేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

‘‘బెంగళూరులో మొత్తం 14 వేల బోరుబావులు ఉన్నాయి. వాటిలో 6900 ఎండిపోయాయి. కొన్ని జలవనరులు ఆక్రమణకు గురయ్యాయి. మహానగరానికి రోజుకు 2600 ఎంఎల్‌డీ నీళ్లు అవసరం. కావేరి నుంచి 1470 ఎంఎల్‌డీ వస్తున్నాయి. 650 ఎంఎల్‌డీ బోరుబావుల నుంచి తీసుకుంటున్నాం. జూన్‌లో ప్రారంభం కానున్న ‘కావేరీ ఫైవ్‌ ప్రాజెక్టు’ ద్వారా చాలావరకు ఇక్కట్లు తీరతాయి. తాగునీటి అవసరాలకు కావేరి, కాబిని జలాలు జూన్ వరకు సరిపోతాయి. 313 చోట్ల కొత్తగా బోరు బావులు తవ్విస్తాం. 1,200 పునరుద్ధరిస్తాం’’ అని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. నీళ్ల సరఫరాకు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌కు చెందిన ట్యాంకర్లు సహా అన్ని ప్రైవేట్ ట్యాంకర్లను ఉపయోగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

సంక్షోభం వేళ నీటి ఆదాకు బెంగళూరు డాక్టర్‌ ‘4 టిప్స్‌’

దాదాపు నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ ఎరుగని రీతిలో నీటి సంక్షోభాన్ని బెంగళూరు ఎదుర్కొంటోంది. వైట్‌ఫీల్డ్‌, కేఆర్‌ పురం, ఎలక్ట్రానిక్స్‌ సిటీ, ఆర్‌ఆర్‌ నగర్‌, కేంగేరీ, సీవీ రామన్‌ ప్రాంతాల్లో సమస్య తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో నీటి వినియోగంపై ఓ వైపు ఆంక్షలు విధిస్తోన్న అధికారులు.. పొదుపు మార్గం అనుసరించాలని పౌరులకు సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని