Bhagawant Mann: పంజాబ్‌ జైళ్లలో వీఐపీ గదులు రద్దు.. 710 ఫోన్లు స్వాధీనం!

పంజాబ్‌లో అధికారంలోకి వచ్చినప్పట్నుంచి పాలనలో తనదైన ముద్ర వేస్తూ దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోన్న ముఖ్యమంత్రి భగవంత్‌ ....

Published : 14 May 2022 16:03 IST

చండీగఢ్‌: పంజాబ్‌లో అధికారంలోకి వచ్చినప్పట్నుంచి పాలనలో తనదైన ముద్ర వేస్తూ దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోన్న ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని జైళ్లలో వీఐపీ గదులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. వీఐపీ సంస్కృతికి స్వస్తి చెబుతూ.. ఆ గదులన్నీ మేనేజ్‌మెంట్‌ బ్లాకులుగా మార్చాలని అధికారులను ఆదేశించినట్టు ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. ఆప్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పట్నుంచి రాష్ట్రంలోని జైళ్లలో 710 ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు సీఎం తెలిపారు. ఇకపై జైళ్ల నుంచి ఫోన్ కాల్స్ ఉండవు.. మోసపూరిత కార్యకలాపాలకూ అవకాశం ఉండదన్నారు. ఫోన్లను లోపలికి పంపిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రభుత్వ జైళ్లలో మొబైల్‌ ఫోన్ల దుర్వినియోగాన్ని అడ్డుకొనేందుకు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో భారీగా ఫోన్లు సీజ్‌ చేసినట్టు తెలిపారు. తమ రాష్ట్రంలోని కారాగారాలు ఇప్పుడు అసలైన సంస్కరణ గృహాలుగా మారతాయన్నారు. చట్ట ఉల్లంఘనకు పాల్పడటం ద్వారా న్యాయస్థానాల్లో దోషిగా తేలిన వ్యక్తులు జైళ్లకు వెళ్లేసరికి ఎలా వీఐపీ అవుతారో తనకు ఎప్పుడూ ఆశ్చర్యంగా ఉంటుందని భగవంత్‌ మాన్‌ వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని