Bilkis Bano: దోషుల విడుదల.. సుప్రీంకు బిల్కిస్‌ బానో

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్‌ బానో సామూహిక అత్యాచార కేసులో దోషులను ముందస్తుగా విడుదల చేయడం తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. తాజాగా వారి విడుదలను సవాల్‌ చేస్తూ బాధితురాలు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Published : 30 Nov 2022 14:45 IST

దిల్లీ: తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దోషులను గుజరాత్‌ ప్రభుత్వం ముందస్తుగా విడుదల చేయడంపై బాధితురాలు బిల్కిస్‌ బానో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో దోషులకు  రెమిషన్‌ పాలసీని అమలు చేసేందుకు గుజరాత్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. ఆ ఉత్తర్వులను పునఃసమీక్షించాలని కోరుతూ తాజాగా బిల్కిస్‌ బానో సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌ను భారత ప్రధాన న్యామయూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం ముందుకు తీసుకొచ్చినట్లు బాధితురాలి తరఫు న్యాయవాది తెలిపారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన సీజేఐ.. దోషుల విడుదలపై గతంలో దాఖలైన పిటిషన్‌తో కలిపి దీన్ని విచారించొచ్చా?లేదా? అన్నది పరిశీలిస్తామని తెలిపారు. గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో బిల్కిస్‌ బానో సుప్రీంకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కేసు నేపథ్యమిదీ..

2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్‌లో అల్లర్లు జరిగినప్పుడు ఈ అత్యాచార ఘటన చోటుచేసుకుంది. బిల్కిస్‌ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని దుండగులు హత్య చేశారు. ఆ సమయంలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21న జీవిత ఖైదు విధించింది. బాంబే హైకోర్టు కూడా దీన్ని సమర్థించింది. దోషులు 15ఏళ్లు కారాగారంలో గడిపారు. అనంతరం తనను విడుదల చేయాలంటూ వారిలో ఒకడు సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. అతడి విజ్ఞప్తిని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం గుజరాత్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కేసులో నిందితులందరికీ రెమిషన్‌ మంజూరు చేయాలని కమిటీ సభ్యులు సిఫార్సు చేశారు. ఆ సిఫార్సులను సుప్రీంకోర్టుకు సమర్పించగా.. దోషులకు 1992 నాటి రెమిషన్‌ పాలసీని అమలు చేసేందుకు గుజరాత్ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం అనుమతినిచ్చింది.

దీంతో ఈ ఏడాది ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేళ గుజరాత్‌ ప్రభుత్వం దోషులను విడుదల చేసింది. అయితే జైలు నుంచి బయటకు వచ్చిన వారిని మిఠాయిలు, పూలదండలతో ఘనంగా స్వాగతించడం అప్పట్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. దోషుల విడుదలను రాజకీయ పార్టీలతో పాటు అనేక సంఘాలు తీవ్రంగా ఖండించాయి. వీరి విడుదలను సవాల్‌ చేస్తూ ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని