మెడికల్‌ ఆక్సిజన్‌ వృథా చేయొద్దు!

కరోనా వైరస్‌ మహమ్మారి ఉద్ధృతి పెరుగుతున్న వేళ.. ఆసుపత్రుల్లో మెడికల్‌ ఆక్సిజన్‌ను వృథా చేయొద్దని కేంద్ర ఆరోగ్యశాఖ అన్ని రాష్ట్రాలకు సూచించింది. కొవిడ్‌ రోగులకు కీలక సమయంలో అవసరమయ్యే మెడికల్‌ ఆక్సిజన్‌ను హేతుబద్ధంగా ఉపయోగించుకోవాలని..ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని వృథా చేయవద్దని స్పష్టం చేసింది.

Updated : 15 Apr 2021 14:47 IST

రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి ఉద్ధృతి పెరుగుతున్న వేళ.. ఆసుపత్రుల్లో మెడికల్‌ ఆక్సిజన్‌ను వృథా చేయొద్దని కేంద్ర ఆరోగ్యశాఖ అన్ని రాష్ట్రాలకు సూచించింది. కొవిడ్‌ రోగులకు కీలక సమయంలో అవసరమయ్యే మెడికల్‌ ఆక్సిజన్‌ను హేతుబద్ధంగా ఉపయోగించుకోవాలని..ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని వృథా చేయవద్దని స్పష్టం చేసింది. ప్రస్తుతం దీనికున్న డిమాండ్‌ దృష్ట్యా మెడికల్‌ ఆక్సిజన్‌ తయారీ పెంచాలని ఉత్పత్తి సంస్థలను ఆదేశించామని, దేశంలో ఆక్సిజన్‌ కొరత లేదని తెలిపింది.

‘అత్యవసర పరిస్థితుల దృష్ట్యా మెడికల్‌ ఆక్సిజన్‌ తయారీని వేగవంతం చేశాం. అన్ని తయారీ కేంద్రాలు రోజువారీ ఉత్పత్తిని పూర్తిస్థాయిలో చేస్తున్నాయి. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఆక్సిజన్‌ నిల్వలు ప్రస్తుత అవసరాలకు సరిపోతాయి’ అని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో నిత్యం 7127 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను తయారు చేసే సామర్థ్యం ఉందని, వీటితో పాటు స్టీల్‌ ప్లాంట్‌లలో లభించే మిగులు ఆక్సిజన్‌ను కూడా వినియోగించుకుంటామని పేర్కొంది. అవసరాలకు అనుగుణంగా ఆయా జిల్లాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆక్సిజన్‌ సరఫరాకు కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేసుకోవాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది.

కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రోగుల ప్రాణాలను రక్షించడంలో మెడికల్‌ ఆక్సిజన్ కీలకం. ప్రస్తుతం దేశంలో కొవిడ్‌ కేసుల సంఖ్య పెరగడంతో, చాలా రాష్ట్రాల్లో ఆక్సిజన్‌ కొరత ఏర్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కొవిడ్‌ తీవ్రతతో అల్లాడుతోన్న మహారాష్ట్ర వేరే రాష్ట్రాల నుంచి మెడికల్‌ ఆక్సిజన్‌ పొందేందుకు ప్రయత్నించినా.. ఆయా రాష్ట్రాలు నిరాకరిస్తున్నాయి. ప్రస్తుతం మెడికల్‌ ఆక్సిజన్‌ను మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, దిల్లీ, పంజాబ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు భారీస్థాయిలో వినియోగిస్తున్నాయి. ఇలాంటి కీలక సమయంలో మెడికల్‌ ఆక్సిజన్‌ వృథా కాకుండా, జాగ్రత్తగా వినియోగించుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ తెలియజేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని