bhupendra yadav: వాతావరణ ఆర్థికసాయం దానమేమీ కాదు 

అభివృద్ధి చెందుతున్న దేశాలకు ‘వాతావరణ ఆర్థిక సాయం’ అందించాల్సిన బాధ్యత, విధి సంపన్న దేశాలదేనని భారత పర్యావరణ, 

Published : 12 Nov 2021 12:51 IST

అది సంపన్న దేశాల విధి
 కేంద్ర మంత్రి భూపేందర్‌ యాదవ్‌

గ్లాస్గో: అభివృద్ధి చెందుతున్న దేశాలకు ‘వాతావరణ ఆర్థిక సాయం’ అందించాల్సిన బాధ్యత, విధి సంపన్న దేశాలదేనని భారత పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ పేర్కొన్నారు. ఏటా వంద బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.7.47 లక్షల కోట్లు) అందిస్తామని ప్రతిజ్ఞ చేసిన సంపన్న దేశాలు ఆ హామీని నిలబెట్టుకోవాలన్నారు. ఐరాస వాతావరణ సదస్సు ‘కాప్‌-26’లో భారత బృందానికి నేతృత్వం వహిస్తున్న ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. సంపన్న దేశాలు ప్రస్తుతం 80 బిలియన్‌ డాలర్లను సమకూర్చుతున్నా, వాతావరణ మార్పులకు అనుగుణంగా తాము శుద్ధ ఇంధన వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడానికి ఇవి ఏమాత్రం సరిపోవని వెనుకబడిన దేశాలు అంటున్నాయి. ఈ దిశగా ఒక్క భారత్‌కే 2.5 ట్రిలియన్‌ డాలర్లు (సుమారు రూ.186 లక్షల కోట్లు) అవసరం. ఈ నేపథ్యంలో భూపేందర్‌ యాదవ్‌ మాట్లాడుతూ- ‘‘వాతావరణ మార్పుల కట్టడికి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అన్ని దేశాలపైనా ఉంది. కానీ, నిధుల లేమి ఇందుకు ప్రతిబంధకంగా మారింది. వెనుకబడిన దేశాలకు ఏటా వంద బిలియన్‌ డాలర్లు అందిస్తామన్న హామీని నిలబెట్టుకోవడంలో సంపన్న దేశాలు విఫలమయ్యాయి. అవి అందించే ఆర్థిక సాయమేమీ దానం కాదు. అది వాటి చారిత్రక బాధ్యత, కర్తవ్యం, విధి, ప్రతిజ్ఞ కూడా’’ అని వ్యాఖ్యానించారు.

ద్విచక్ర, త్రిచక్ర వాహనాలపైనా దృష్టి సారించాలి

జీరో ఉద్గారాల లక్ష్యాన్ని సాధించేందుకు ఇతర వాహనాలతో పాటు ద్విచక్ర, త్రిచక్ర వాహనాల నుంచి వెలువడే కాలుష్యంపైనా దృష్టి సారించాలని కాప్‌-26లో భారత్‌ నొక్కి చెప్పింది. ‘‘ప్రపంచ వాహన విక్రయాల్లో 70% పైగా ద్విచక్ర, త్రిచక్ర వాహనాలదే. భారత్‌లో వీటి వాటా 80% పైనే ఉంది. వీటిని కూడా ఉద్గారాల రహిత వాహనాలుగా మార్చాల్సి ఉంది’’ అని ఉద్ఘాటించింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని