విజయోత్సవ ర్యాలీలపై ఈసీ నిషేధం

దేశంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మే 2న నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాల తర్వాత విజయోత్సవ

Updated : 27 Feb 2024 19:20 IST

దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మే 2న నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు, ఆ తర్వాత విజయోత్సవ ర్యాలీలను నిషేధించింది. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు  ఎలాంటి సంబరాలు నిర్వహించొద్దని స్పష్టం చేసింది. విజేతలుగా నిలిచిన అభ్యర్థులు రిటర్నింగ్‌ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రాలు తీసుకునే సయమంలో వారి వెంటనే ఇద్దరు మించి ఉండరాదని ఆదేశించింది. కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా అన్ని రాజకీయ పార్టీలు, నేతలు ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది.

పశ్చిమ బెంగాల్‌ సహా కేరళ, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 2న వెలువడనున్నాయి. బెంగాల్‌లో ఇప్పటికే ఏడు దశల పోలింగ్‌ పూర్తవగా.. ఏప్రిల్‌ 29న చివరి విడత ఓటింగ్‌ నిర్వహించనున్నారు. అయితే కరోనా కేసులు పెరుగుతున్న వేళ ఈ ఎన్నికలు విమర్శలకు దారితీశాయి. ప్రచారం పేరుతో రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించడంతో ఎన్నికలు సూపర్‌ స్ప్రెడర్‌ ఈవెంట్లుగా మారుతున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.

మరోవైపు ఎన్నికల ఎఫెక్ట్‌ పశ్చిమ బెంగాల్‌పై తీవ్రంగానే పడింది. అక్కడ గత కొద్ది రోజులుగా కరోనా కేసులు విపరీతంగా పెరిగాయి. దీంతో బెంగాల్‌లో అన్ని రోడ్‌షోలు, పాదయాత్రలు, ర్యాలీలను ఈసీ నిషేధించింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని