ఐఐటీ ముంబయి విద్యార్థులకు మార్గదర్శకాలు

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా విశ్వవిద్యాలయాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఐఐటీ ముంబయి వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు మార్గదర్శకాలు జారీచేసింది....

Updated : 30 Jan 2020 10:59 IST

ముంబయి: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా విశ్వవిద్యాలయాల్లో  నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఐఐటీ ముంబయి వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు మార్గదర్శకాలు జారీచేసింది. ఈ మేరకు విద్యార్థి వ్యవహారాల డీన్‌, వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు మెయిల్ ద్వారా మార్గదర్శకాలతో కూడిన లేఖను పంపారు. అందులో వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులు దేశ, సంఘ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనకూడదని కోరారు. అంతేకాకుండా ప్రసంగాలు, బహిరంగ ప్రదేశాల్లో నాటకాలు ప్రదర్శించడం, సంగీత కార్యక్రమాలు, ఆటలు ఆడటం, కరపత్రాలు పంపిణీ చేయడం వంటి వాటితో పాటు వసతి గృహ పరిసరాల్లో శాంతికి భంగం కలిగించే కార్యకలాపాలు నిషేధించడం జరిగిందని లేఖలో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్దంగా వ్వవహరించిన విద్యార్థులను వసతి గృహాల నుంచి సస్పెండ్ చేస్తామని తెలిపారు.

దీనిపై ఐఐటీ ముంబయి విద్యార్థులు మాట్లాడుతూ ‘‘ఎటువంటి కార్యకలాపాలు దేశ, సంఘ వ్యతిరేకంగా పరిగణింపబడతాయనేది లేఖలో స్పష్టంగా పేర్కొనలేదని, యాజమాన్యం విద్యార్థుల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అణగతొక్కేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఐఐటీ పరిపాలన విభాగం అధికారులు దీనిపై పూర్తి స్పష్టతనిచ్చే వరకు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తమ ఆందోళనలు కొనసాగిస్తామని తెలిపారు.’’ గణతంత్రదినోత్సవం సందర్భంగా రాజ్యాంగంపై అవగాహన కల్పించేందుకు ఐఐటీ ముంబయికి చెందిన 1500 మంది విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అంతే కాకుండా కొద్ది రోజుల క్రితం దిల్లీలో జేఎన్‌యూ విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై దాడిని నిరసిస్తూ ఐఐటీ ముంబయికి చెందిన విద్యార్థులు గేట్‌వే ఆఫ్‌ ఇండియా వద్దకు చేరుకొని నిరసన చేపట్టారు. ఆ సమయంలో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య ఘర్షన చోటుచేసుకొన్న విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో వనతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులెవరు సంఘ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనకూడదని ఐఐటీ ముంబయి తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని