ఒక్క డాలరుకే ఈ ఇల్లు మీ సొంతం

అభివృద్ధి, పట్టణీకరణ అంటూ అన్ని దేశాల్లోనూ గ్రామాలను పట్టించుకోవడం మానేశారు. మారుమూల గ్రామాల్లో పుట్టినవాళ్లు కూడా పట్టణాల్లో స్థిరపడుతూ వారి స్వస్థలాలను మరిచిపోతున్నారు. ఇటలీలోనూ ప్రస్తుతం ఇదే జరుగుతోందట. పట్టణాల్లో స్థిరపడుతున్న వారు సొంత ఇళ్లను

Updated : 12 Aug 2020 14:16 IST

షరతులు వర్తిస్తాయి

అభివృద్ధి, పట్టణీకరణ అంటూ అన్ని దేశాల్లోనూ గ్రామాలను పట్టించుకోవడం మానేశారు. మారుమూల గ్రామాల్లో పుట్టినవాళ్లు కూడా పట్టణాల్లో స్థిరపడుతూ వారి స్వస్థలాలను మరిచిపోతున్నారు. ఇటలీలోనూ ప్రస్తుతం ఇదే జరుగుతోందట. పట్టణాల్లో స్థిరపడుతున్న వారు సొంత ఇళ్లను వదిలేయడంతో గ్రామాలన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. అక్కడి ఇళ్లన్నీ పాడుబడిపోతున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి ప్రభుత్వం ఓ ఆలోచన చేసింది. నిర్మానుష్యంగా మారిన గ్రామాల్లో ఒకటైన చింక్వా ఫ్రాండీలో ఖాళీగా ఉన్న ఇళ్లను స్వాధీనం చేసుకొని కేవలం ఒక్క అమెరికన్‌ డాలరుకే అమ్మకానికి పెట్టింది. అయితే దాన్ని సొంతం చేసుకోవాలంటే... కొన్ని నిబంధనలు వర్తిస్తాయి.

‘‘నివాసం ఉండాలనుకునే వారిని ఆహ్వానించి ఇక్కడి పాడుబడిన ఇళ్లకు పునర్‌ వైభవం తీసుకురావాలనే ఈ ‘ఆపరేషన్‌ బ్యూటీ’ మిషన్‌ చేపట్టాం. ఇక్కడి వాళ్లను ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఆపేందుకు ప్రయత్నించాం. కానీ అందరూ ఇక్కడి ఇళ్లను వదిలేసి వేరే ప్రాంతాలకు తరలిపోయారు. ఇప్పుడు ఖాళీగా ఉన్న ఇళ్లను వచ్చే వారితో భర్తీ చేయడమే మాకున్న లక్ష్యం’

- మిషెల్‌ కొనియా, మేయర్‌

ఇటలీలో కరోనా కేసులు ఎక్కువగానే ఉన్నా.. అక్కడి దక్షిణ కాలబ్రియా ప్రాంతంలోని చింక్వా ఫ్రాండీ గ్రామంలో మాత్రం ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదట. కరోనా లాక్‌డౌన్‌ను ఎత్తేయడంతో స్థానిక ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఇళ్లను అమ్మేందుకు ‘ఆపరేషన్‌ బ్యూటీ’ మిషన్‌ను ప్రారంభించింది. ఈ గ్రామంలోనే స్థిరపడాలని భావించేవారు కేవలం ఒక్క డాలరు చెల్లించి ఇంటిని సొంతం చేసుకోవచ్చు. అయితే పాడుబడిన ఇళ్లు కావడంతో మూడేళ్లలో ఇంటిని బాగు చేసుకోవడం.. లేదా పునర్మించుకోవడం చేయాలి. అప్పటివరకు ఏడాదికి 280 డాలర్లు (సుమారు రూ.21వేలు) ఇన్సూరెన్స్‌ పాలసీ కట్టాల్సి ఉంటుంది. ఇల్లు బాగు చేసుకున్నాక... ఇన్సూరెన్స్‌ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మూడేళ్లు దాటినా ఇల్లు బాగుచేసుకోకపోతే ప్రభుత్వం 22,470 డాలర్లు (సుమారు రూ. 17 లక్షలు) జరిమానా విధిస్తుంది. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని