‘చైనా భయం’ను తరిమిన ఆయన..!

పొరుగు దేశంపై యుద్ధంలో విజయానికి ఫలం ఒక్క భూభాగమే కాదు.. మానసికంగా కూడా పైచేయి లభిస్తుంది.. ఈ సైకలాజికల్‌ అడ్వాంటేజ్‌ విజేతతో  వెర్రి వేషాలు వేయిస్తుంది. తరచూ పొరుగు దేశాన్ని వేధించేలా

Updated : 18 Jun 2020 17:09 IST

 1967 విజయంలో ఓ అధికారి కీలక పాత్ర

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

పొరుగు దేశంపై యుద్ధంలో విజయానికి ఫలం ఒక్క భూభాగమే కాదు.. మానసికంగా కూడా పైచేయి లభిస్తుంది.. ఈ సైకలాజికల్‌ అడ్వాంటేజ్‌ విజేతతో  వెర్రి వేషాలు వేయిస్తుంది. తరచూ పొరుగు దేశాన్ని వేధించేలా ప్రేరేపిస్తుంది. నష్టపోయిన దేశం కూడా.. బాధను మౌనంగా భరిస్తుంది. విజేతకు తలకెక్కిన గర్వాన్ని ఒక్కసారి దెబ్బకొడితే.. మరోసారి వేధించడానికి వెయ్యిసార్లు ఆలోచిస్తాడు. చైనా విషయంలో భారత్‌ ఇదే చేసింది. అది కూడా ఒక అధికారి మొండిగా తీసుకొన్న నిర్ణయం భారత్‌కు ఏనుగంత బలాన్నిచ్చి డ్రాగన్‌ను చావుదెబ్బ కొట్టింది.   

 భారత్‌ 1962లో జరిగి యుద్ధంలో భూభాగాన్ని  కోల్పోవడం చాలా నష్టం చేసింది. మన దేశ పరపతి ప్రపంచ వ్యాప్తంగా దెబ్బతింది. అంతేకాదు.. చైనా పరపతి పెరిగింది. దీనికి తోడు భారత్‌పై డ్రాగన్‌కూ సైకాలాజికల్‌ అడ్వాంటేజ్‌ లభించింది.  ఇలాంటి పరిస్థితుల్లో సరిహద్దుల్లో చైనా ఏం చేసిన చెల్లుబాటువుతుంది ప్రవర్తించేంది. కానీ, ఒక్క సైనిక అధికారి మొండి ధైర్యం చైనాను చెప్పుకోలేనట్లు దెబ్బకొట్టింది. ఆయన పేరు లెఫ్టినెంట్‌ జనరల్‌ సగత్‌ సింగ్‌..!

1950లో గుర్ఖా రైఫిల్స్‌లో చేరిన సగత్‌ సింగ్‌ రెండు,మూడు బెటాలియన్లకు కమాండెంట్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత  50వ పారాచూట్‌ బ్రిగేడ్‌కు నేతృత్వం వహించారు. గోవా విమోచనంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత మేజర్‌ జనరల్‌గా 17వ మౌంటేన్‌ డివిజన్‌లో జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌గా వ్యవహరించారు. ఈ డివిజన్‌ కీలకమైన నాథులా, చోలా కనుమల రక్షణకు బాధ్యత వహిస్తుంది. ఈ నాథులా, చోలా పాస్‌లను దక్కించుకోవాలని చైనా ఎప్పటి నుంచో చూస్తోంది.  

నాథూలా ఎందుకు అంతకీలకం..

పర్వత సరిహద్దుల్లో ఎప్పుడూ ఎత్తైన ప్రదేశాలు, కనుమలు వ్యూహాత్మక ఆధిపత్యాన్ని అందిస్తాయి. అక్కడ ఉండే దళాలు ప్రత్యర్థుల తాటాకు చప్పుళ్లకు భయపడితే ఆ ఫలితాన్ని దేశం కొన్ని తరాల వరకు అనుభవించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ విధులు నిర్వహించేటప్పుడు అవసరమైతే ప్రాణాలకు తెగించి పోరాడాలి. ఆ దశంలో విజయం దేశ చరిత్రను మార్చేస్తుంది. నాథూలా కూడా అలాంటిదే. ఇక్కడ నుంచి నేరుగా చైనా మనదేశంపై నిఘా పెట్టవచ్చు. దీంతోపాటు నాథూలాపై విజయం సాధిస్తే నేరుగా సిలిగుడి కారిడార్‌పై పట్టులభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత్‌కు ఇది వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైంది. 

1965లో దానిని ఖాళీ చేయాలని భారత్‌ను చైనా హెచ్చరించింది. మెల్లగా అక్కడ బలగాలను పెంచింది. మరీ ఇబ్బంది అయితే అక్కడి నుంచి భారత దళాలు వెనక్కు వచ్చే వెసులుబాటు ఉంది. కానీ, అక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్న మేజర్‌ జనరల్‌ సగత్‌ సింగ్‌ ఆ మార్గాన్ని ఎంచుకోలేదు. ఆయన మొండిగా అక్కడే ఉన్నాడు. దీంతో రెండేళ్లపాటు చైనాను భారత్‌ ధైర్యంగా ఎదుర్కొంది. 

 మరోపక్క 1967 ఆగస్టు 13 నుంచి చైనా సైన్యం సరిహద్దుల సమీపంలో గోతులు తవ్వడం మొదలు పెట్టింది.దాడికి సిద్ధం అవుతోంది అనడానికి అదో సంకేతం. ఈ విషయాన్ని గమనించిన భారత్‌ అక్కడ కంచె వేసే పనిని మొదలుపెట్టింది. సెప్టెంబర్‌ 11న ఇక్కడ చైనా సైన్యంతో ఓ ఘర్షణ జరిగింది. ఇది నిమిషాల్లో పెద్దదైపోయి భారత దళాలపై కాల్పులు జరిపారు. భారత్‌ వైపు ప్రాణ నష్టం జరిగింది. ఆ తర్వాత చైనా  శతఘ్నులను వాడటం మొదలుపెట్టింది. దీంతో భారత దళాలు కూడా శతఘ్నులతో ఎదురు దాడికి దిగాయి. ఈ పోరు మొత్తం నాలుగు రోజులు జరిగింది. భారత దళాలు చైనా బలగాలను వెనక్కి తరిమి కొట్టాయి. ఈ క్రమంలో చాలా చైనా బంకర్లు ధ్వంసమైపోయాయి. అక్టోబర్‌ 1న మరోసారి చోలా వద్ద భారత దళాలపై చైనా విరుచుకు పడింది. ముందే అంచనా వేసిన భారత్‌ ఈ దాడిని సమర్థంగా తిప్పికొట్టింది. చివరకు  చైనా బలగాలు తోకముడిచాయి. ఇక్కడ చైనా దళాలను దాదాపుమూడు కిలోమీటర్లు వెనక్కి తరిమాయి. ఈ ఘటన భారత బలగాల్లో ఆత్మవిశ్వాసం నింపింది. 1962లో చైనాకు లభించిన మానసిక ఆధిపత్యాన్ని పటాపంచలు చేసింది. ఆ విజయానికి చిహ్నంగా ఇప్పటికీ నాథులా, చోలాలో త్రివర్ణ పతాకం హుందాగా రెపరెపలాడుతుంటుంది.

సగత్‌ సింగ్‌ ఆ తర్వాత ఇండో బంగ్లా యుద్ధంలో పాల్గొన్నారు. ఢాకాను స్వాధీనం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించారు. పాక్‌ దళాలు లొంగిపోతున్నట్లు  జనరల్‌ ఏఏకే నియాజీ సంతకం చేస్తున్న చిత్రంలో కూడా సగత్‌ సింగ్‌ కనిపిస్తారు. ఆయన్ను పద్మభూషణ్‌, పరమ విశిష్ఠ సేవా పతకాలు వరించాయి. అలా ఒక సైనిక అధికారి మొండి ధైర్యం దేశానికి ప్రేరణగా నిలిచింది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని