
పాస్‌పోర్ట్ జారీలో తెలుగు రాష్ట్రాలదే పైచేయి
త్వరలో అందుబాటులోకి ఈ-పాస్‌పోర్టులు: విదేశాంగ శాఖ
దిల్లీ: దేశవ్యాప్తంగా పాస్‌పోర్ట్ జారీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హరియాణా రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. అలానే పాస్‌పోర్ట్ భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు చిప్ పొందుపరిచిన ఈ-పాస్‌పోర్ట్‌లను జారీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ‘‘చిప్ ఆధారిత ఈ-పాస్‌పోర్ట్‌ల కోసం ప్రస్తుతం మేము ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్ నాసిక్, నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్‌తో కలిసి పనిచేస్తున్నాం. ఈ-పాస్‌పోర్ట్ మన ప్రయాణ పత్రాలకు మరింత భద్రత కల్పిస్తుంది. దీనికి సంబంధించిన పనులను ఇప్పటికే ప్రారంభించాం. ప్రస్తుతం మనకు వీటి అవసరం ఎంతో ఉంది’’ అని మంత్రి అన్నారు.
త్వరలోనే పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు (పీఎస్‌కే) లేని ప్రతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 488 లోక్‌సభ నియోజక వర్గాల్లో ఈ సేవలు అందించామని, ఎంతో వేగంగా పూర్తి చేయాల్సిన ఈ పనుల్లో కరోనా కారణంగా ఆలస్యం జరిగిందని తెలిపారు. త్వరలోనే వీటిని పూర్తి చేస్తామని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
అలానే పాస్‌పోర్ట్ జారీ మరింత సులభతరం చేసినట్లు మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. పాస్‌పోర్ట్ సేవా దివస్‌ను పురస్కరించుకొని భారత్‌తో పాటు విదేశాల్లో ఉన్న పాస్‌పోర్ట్ జారీ అధికారులను సత్కరించనున్నట్లు మంత్రి తెలిపారు. ‘‘మనమంతా ప్రత్యేక పరిస్థితుల్లో కలుస్తున్నాం. అందుకు మీ అందర్ని అభినందిస్తున్నాను. కరోనా కారణంగా మారుతున్న ప్రజా అవసరాల దృష్ట్యా మీరు స్పందించిన తీరును నేను గుర్తించాను’’అని మంత్రి పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల సిబ్బందిని ఉద్దేశించి అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.