పాకిస్థాన్ విమానాల‌ను నిషేధించిన అమెరికా!

న‌కిలీ పైలట్ లైసెన్సుల వివాదం పాకిస్థాన్‌ను వెంటాడుతోంది. ఇప్ప‌టికే యూరోపియ‌న్ యూనియ‌న్ పాకిస్థాన్ అంత‌ర్జాతీయ విమాన సంస్థ(పీఐఏ)పై నిషేధం విధించిన విష‌యం తెలిసిందే. తాజాగా అమెరికా కూడా అదేదారిలో ముందుకెళ్లింది. పాకిస్థాన్ నుంచి అమెరికాకు న‌డిచే పీఐఏ చార్ట‌ర్ విమానాల అనుమ‌తిని ర‌ద్దుచేస్తున్న‌ట్లు యూఎస్ డిపార్డ్‌మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేష‌న్ ప్ర‌క‌టించింది.

Published : 11 Jul 2020 00:10 IST

న‌కిలీ పైల‌ట్ లైసెన్సుల ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో నిర్ణ‌యం

వాషింగ్ట‌న్‌: న‌కిలీ పైలట్ లైసెన్సుల వివాదం పాకిస్థాన్‌ను వెంటాడుతోంది. ఇప్ప‌టికే యూరోపియ‌న్ యూనియ‌న్ పాకిస్థాన్ అంత‌ర్జాతీయ విమానసంస్థ(పీఐఏ)పై నిషేధం విధించిన విష‌యం తెలిసిందే. తాజాగా అమెరికా కూడా అదేదారిలో ముందుకెళ్లింది. పాకిస్థాన్ నుంచి అమెరికాకు న‌డిచే పీఐఏ చార్ట‌ర్ విమానాల అనుమ‌తిని ర‌ద్దుచేస్తున్న‌ట్లు యూఎస్ డిపార్డ్‌మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేష‌న్ ప్ర‌క‌టించింది.

పాకిస్థాన్‌లో స‌గానికిపైగా పైలట్ లైసెన్సులు న‌కిలీవ‌ని తేల‌డంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లుదేశాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. తాజాగా అమెరికా ఫెడ‌ర‌ల్ ఏవియేష‌న్ అడ్మినిస్ట్రేష‌న్‌(ఎఫ్ఏఏ) కూడా పీఐఏ విమాన స‌ర్వీసుల‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. దీంతో స‌దరు విమాన సంస్థ స‌ర్వీసుల‌ను అమెరికా రాకుండా నిషేధించింది. అయితే, దిద్దుబాటు చ‌ర్య‌లు ద్వారా ఈ స‌మస్య‌లు ప‌రిషార్కం అవుతాయని పీఐఏ స్థానిక మీడియాకు వెల్ల‌డించింది.

పాకిస్థాన్‌లో ఇప్పటివరకు జారీయైన పైలట్ లైసెన్సుల్లో ఎక్కువశాతం చెల్లనివని అక్కడి ప్రభుత్వ నివేదిక స్పష్టం చేసింది. దేశంలో 860క్రియాశీల పైలట్ లైసెన్సులుండగా వీటిలో దాదాపు 262లైసెన్సులు సందేహాస్పదంగా ఉన్నాయని తేలింది. దీనిపై పాకిస్థాన్ పార్లమెంటులోనూ చర్చ జరిగింది. కేవలం పాకిస్థాన్ అంతర్జాతీయ విమానయానసంస్థ(పీఐఏ)లోనే మూడోవంతు పైలట్లు తప్పుడు విధానంలో లైసెన్సులు పొందినట్లు ద‌ర్యాప్తులో వెల్ల‌డైంది. పీఐఏలో దాదాపు 434మంది పైలట్లు ఉండగా, వీరిలో 141 లైసెన్సులను పాకిస్థాన్ విమానయానశాఖ ఇప్ప‌టికే ర‌ద్దు చేసింది. పాకిస్థాన్‌లో మే నెలలో పీఐఏ విమానం కుప్పకూలి 97మంది మృత్యువాతపడిన అనంత‌రం జ‌రిగిన ద‌ర్యాప్తులో ఈ న‌కిలీ పైలట్ లైసెన్సుల వ్య‌వ‌హారం బ‌ట్ట‌బ‌య‌లైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని