Supreme Court: వినియోగదారుల చట్ట పరిధిలోకి విద్య వస్తుందా?

వినియోగదారుల రక్షణ చట్టం కింద అందించే సేవల పరిధిలోకి విద్య వస్తుందా? లేదా? అనేది స్పష్టం చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.

Published : 04 Nov 2021 10:05 IST

 తేల్చి చెప్పనున్న సర్వోన్నత న్యాయస్థానం


దిల్లీ: వినియోగదారుల రక్షణ చట్టం కింద అందించే సేవల పరిధిలోకి విద్య వస్తుందా? లేదా? అనేది స్పష్టం చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఇలాంటి అంశానికే సంబంధించి మరో కేసులో తీర్పు పెండింగ్‌లో ఉందని, అందువల్ల ఈ అంశాన్ని దానికి జత చేస్తున్నట్లు జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ బీవీ నాగరత్నల ధర్మాసనం గత నెల 29న జారీచేసిన ఆదేశాల్లో పేర్కొంది. సివిల్‌ అప్పీల్‌ 3504 -2020 (మను సోలంకి వర్సెస్‌ వినాయక మిషన్‌ యూనివర్సిటీ) కేసును ఈ సందర్భంగా ప్రస్తావించింది. విద్యా సంస్థలు వినియోగదారుల రక్షణ చట్టం-1986 పరిధిలోకి రావని, ఈత వంటి సహా పాఠ్యాంశ కార్యకలాపాలకు వినియోగదారుల రక్షణ చట్టం -1986లో ‘సేవ’కు ఇచ్చిన అర్థం వర్తించదని పేర్కొంటూ జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ (ఎన్‌సీడీఆర్‌సీ) గతంలో ఆదేశాలు జారీచేసింది. ఆ ఆదేశాలను సవాలుచేస్తూ ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూకు చెందిన ఓ వ్యక్తి సర్వోన్నత న్యాయస్థానం తలుపు తట్టారు. 

పిటిషన్‌ దాఖలు చేసిన వ్యక్తి తన కుమారుడిని 2007లో ఓ వేసవి శిక్షణ శిబిరంలో చేర్పించారు. రూ.వెయ్యి ఫీజు చెల్లించారు. ఈ క్రమంలో పాఠశాలకు రావాలంటూ 28 మే, 2007న విద్యా సంస్థ యాజమాన్యం నుంచి ఫోన్‌ వచ్చింది. అనంతరం పాఠశాలకు వెళ్లగా ‘మీ అబ్బాయిని అత్యవసరంగా ఆసుపత్రిలో చేర్పించాం’ అని సిబ్బంది చెప్పారు. దీంతో ఆసుపత్రికి వెళ్లగా.. తమ దగ్గరకు తీసుకొచ్చేసరికే బాలుడు మరణించాడని వైద్యులు తెలిపారు. దీనిపై బాలుడి తండ్రి రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ని ఆశ్రయించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి తన కుమారుడి మరణానికి కారణమైన పాఠశాల యాజమాన్యం నుంచి రూ.20 లక్షలు పరిహారం ఇప్పించాలని, తాను అనుభవించిన క్షోభకు రూ.2 లక్షలు, కోర్టు ఖర్చులకు రూ.55,000 చెల్లించేలా కూడా ఆదేశాలు జారీచేయాలని కోరారు. ఈ వ్యవహారంలో ఫిర్యాదు చేసిన వ్యక్తి వినియోగదారుడు కాదని, అందువల్ల పిటిషన్‌ని కొట్టివేస్తున్నట్లు రాష్ట్ర కమిషన్‌ పేర్కొంది. దీంతో ఆయన ఎన్‌సీడీఆర్‌సీని ఆశ్రయించారు. సహ పాఠ్యాంశ కార్యకలాపాలైన ఈత తదితర అంశాలతో కూడిన విద్య వినియోగదారుల రక్షణ చట్టం-1986 పరిధిలోకి రాదని ఎన్‌సీడీఆర్‌సీ కూడా పేర్కొంది. ఫిర్యాదుదారుడు వినియోగదారుడు కాదన్న రాష్ట్ర కమిషన్‌ అభిప్రాయంతో ఏకీభవించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని