Tomato: దక్షిణాదిన మంటెత్తిన టమాట

దక్షిణాది రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో టమాట ధరలు మండిపోతున్నాయి. నిరంతరాయంగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఉత్తరాది 

Updated : 07 Dec 2021 13:23 IST

 అండమాన్‌లో కిలో రూ.140

 భారీ వర్షాలు, ఉత్తరాది నుంచి తగ్గిన సరఫరాతో కొరత: కేంద్రం వెల్లడి

దిల్లీ: దక్షిణాది రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో టమాట ధరలు మండిపోతున్నాయి. నిరంతరాయంగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఉత్తరాది నుంచి సరఫరా తగ్గిపోవడంతో వాటి ధరలు ఆకాశాన్నంటాయి. కొన్ని చోట్ల ఏకంగా కిలో రూ.140 పలికిందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు సోమవారం నాడు దేశవ్యాప్తంగా రిటైల్‌ మార్కెట్లలో నమోదైన టమాట ధరల వివరాలను విడుదల చేసింది. దాని ప్రకారం కిలో టమాట ధర ఉత్తరాదిలో రూ.30-83 మధ్య పలుకుతోంది. పశ్చిమ రాష్ట్రాల్లో రూ.30-85, తూర్పు ప్రాంతంలో రూ.39-80 మధ్య ఉంది. అండమాన్, నికోబార్‌ దీవుల్లోని మాయాబందర్‌లో రూ.140, పోర్ట్‌బ్లెయిర్‌లో రూ.127 కిలో టమాట కోసం వెచ్చించాల్సి వస్తోంది. కేరళలోనూ వాటి ధరలు భగ్గుమంటున్నాయి. తిరువనంతపురం, పాలక్కడ్, వయనాడ్, త్రిస్సూర్, కోజికోడ్, కొట్టాయంలలో వరుసగా రూ.125, రూ.105, రూ.105, రూ.94, రూ.91, రూ.83 పలుకుతోంది. కర్ణాటకలోని మంగళూరు, తుమకూరులలో రూ.100, ధార్వాడ్‌లో రూ.75, మైసూరులో రూ.74, శివమొగ్గలో రూ.67, దావణగెరెలో రూ.64, బెంగళూరులో రూ.57 ఖర్చు చేయాల్సి వస్తోంది. 

అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో మాత్రం వాటి ధరలు రూ.30-40 మధ్య ఉన్నాయి. మెట్రో నగరాల్లోనూ కిలో టమాటకు రూ.50పైనే చెల్లించాల్సి వస్తోంది. ముంబయిలో రూ.55, దిల్లీలో రూ.56, కోల్‌కతాలో రూ.78, చెన్నైలో రూ.83 మేర పలుకుతోంది. దేశవ్యాప్తంగా రెండు వారాలుగా సగటున కిలో టమాట ధర రూ.60గా ఉన్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్‌లలో సెప్టెంబరులో కురిసిన భారీ వర్షాలకు పంట దెబ్బతినడంతో సరఫరా పడిపోయిందని, దీనికితోడు ఆ తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో ఎడతెగని వర్షాలతో టమాటకు కొరత ఏర్పడిందని పేర్కొంది. గతేడాది ఖరీఫ్‌ సీజన్‌లో 70.12 లక్షల టన్నుల టమాట దిగుబడి రాగా, ఈ ఏడాది అదే సీజన్‌లో 69.52 లక్షల టన్నుల ఉత్పత్తి వచ్చినట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే ఉత్తరాది నుంచి తాజా పంటల దిగుబడి వస్తుండడంతో డిసెంబరు నుంచి టమాట ధరలు తగ్గనున్నాయని ఇటీవల కేంద్రం ప్రకటించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని