Mughal Gardens: మొఘల్‌ గార్డెన్స్‌‌‌‌‌.. ఇక ‘అమృత్‌ ఉద్యాన్‌’

దిల్లీ రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్‌ గార్డెన్స్‌ పేరును కేంద్ర ప్రభుత్వం ‘అమృత్‌ ఉద్యాన్‌’గా మార్చింది. ‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌’ స్ఫూర్తితో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Published : 28 Jan 2023 19:55 IST

దిల్లీ: రాష్ట్రపతి భవన్‌ నుంచి ఇండియా గేట్‌ వరకు విస్తరించిన రాజ్‌పథ్‌ పేరును కర్తవ్యపథ్‌గా మార్చిన కేంద్రం.. తాజాగా రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్‌ గార్డెన్స్‌(Mughal Gardens) పేరును ‘అమృత్‌ ఉద్యాన్‌(Amrit Udyan)’గా మార్చింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తోన్న 'అమృత్ మహోత్సవ్(Amrit Mahotsav)' థీమ్‌కు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(Droupadi Murmu) ఈ పేరు పెట్టినట్లు రాష్ట్రపతి భవన్‌(Rashtrapati Bhavan) వర్గాలు వెల్లడించాయి. ఇక్కడ ఉన్న అన్ని ఉద్యానాలను కలిపి ఇకనుంచి ‘అమృత్ ఉద్యాన్‌’గా పిలవనున్నట్లు తెలిపాయి.

‘అమృత్‌ ఉద్యాన్‌’గా పేరు మార్చిన ఈ గార్డెన్‌ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం ఉదయం ప్రారంభించనున్నారు. ఏటా నిర్వహించే ‘ఉద్యానోత్సవం’లో భాగంగా ఈ ఏడాది జనవరి 31 నుంచి మార్చి 26 వరకు దాదాపు రెండు నెలలపాటు సందర్శకుల కోసం తెరిచి ఉంచనున్నారు. మార్చి 28 నుంచి 31 మార్చి వరకు రైతులు, దివ్యాంగులు, మహిళలకు ప్రత్యేక సందర్శన ఉంటుందన్నారు.

జమ్మూ- కశ్మీర్‌లోని మొఘల్ గార్డెన్స్, తాజ్‌మహల్ వద్ద ఉన్న ఉద్యానం స్ఫూర్తిగా రాష్ట్రపతి భవన్‌లోని ఉద్యానాన్ని రూపొందించారు. ఇక్కడ చతురస్రాకారం, దీర్ఘచతురస్రాకారం, వృత్తాకారంలో ఎన్నో రకాల పూలతోటలు, సరస్సులు ఉన్నాయి. ఆంగ్లేయుల పాలనా కాలంలో ఇక్కడ లాన్‌లను ఏర్పాటు చేశారు. 15 ఎకరాల మేర విస్తరించి ఉన్న ఈ ఉద్యానంలో ఔషధి వనం, ఆధ్యాత్మిక వనం, బోన్సాయ్ గార్డెన్‌తో పాటు జీవవైవిధ్య పార్కు ఉంది. ఏడాదికోసారి ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేయడానికి ‘ఉద్యానోత్సవం’ పేరుతో ఈ గార్డెన్స్‌ తలుపులు తెరుచుకుంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని