Gujarat Polls: ఓటర్లకు ప్రలోభాలు.. రూ.290కోట్ల విలువైన మద్యం, నగదు స్వాధీనం

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం ఉదయం పోలింగ్‌ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటివరకు రూ.290 కోట్ల విలువలైన నగదు, మద్యం, మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.

Published : 30 Nov 2022 22:37 IST

దిల్లీ: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల (Gujarat Elections)తొలి దశకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. గురువారం ఉదయం పోలింగ్‌ ప్రారంభం కానుంది. ఇదే సమయంలో రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటివరకు రూ.290 కోట్ల విలువైన నగదు, మద్యం, మాదక ద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత ఎన్నికల (2017) సమయంలో స్వాధీనం చేసుకున్న వాటితో పోలిస్తే ఈసారి 10రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.

రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో వివిధ శాఖల నిఘా బృందాలతో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇదే సమయంలో వడోదరలోని ఓ మెఫెడ్రోన్‌ తయారీ కేంద్రంపై దాడులు జరిపిన గుజరాత్‌ ఏటీఎస్‌ బృందం.. 143 కేజీల సింథెటిక్‌ డ్రగ్‌ను గుర్తించింది. వీటి విలువ సుమారు రూ.478కోట్లు ఉంటుందని అంచనా. ఇందుకు సంబంధించి ఐదుగురిని అరెస్టు చేసిన అధికారులు.. నార్కొటిక్స్‌ డ్రగ్స్‌ (ఎన్డీపీఎస్‌) చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

మరోవైపు, 2017లో గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రూ.27.21 కోట్ల విలువైన నగదు, మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కానీ, ఈసారి అది పది రెట్లు పెరిగి రూ.290కోట్లకు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 4లక్షల లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. వీటి విలువ రూ.14.88కోట్లుగా పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని