PM Modi: హెచ్‌ఏఎల్‌పై దుష్ప్రచారం చేసిన వారికి ఇదే సమాధానం: ప్రధాని మోదీ

రఫేల్‌ యుద్ధ విమానాల (Rafale Fighter Jets) ఒప్పందం విషయంలో తప్పుడు ఆరోపణలతో పార్లమెంట్‌ సమయాన్ని ప్రతిపక్షాలు వృథా చేశాయనీ.. వారందరికీ హెచ్‌ఏఎల్‌ హెలికాఫ్టర్‌ ఫ్యాక్టరీయే (HAL Helicopter Factory)సమాధానం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

Updated : 06 Feb 2023 23:03 IST

బెంగళూరు: రఫేల్ యుద్ధ విమానాల (Rafale Fighter Jets) ఒప్పందంపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ప్రధాని మోదీ (PM Modi) మండిపడ్డారు. సోమవారం కర్ణాటక (Karnataka)లోని తుమకూరు(Tumakuru)లో హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ (HAL) సంస్థకు చెందిన అతిపెద్ద హెలికాఫ్టర్ల (Helicopter) తయారీ యూనిట్‌ను ప్రారంభించారు. ఈ  సందర్భంగా రఫేల్‌ ఒప్పందం విషయంలో ప్రతిపక్షాలు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని కాంగ్రెస్‌ (Congress)ను ఉద్దేశించి విమర్శించారు. 

‘‘ హెచ్‌ఏఎల్‌ విషయంలో మా ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేసిన విపక్షాలకు సమాధానమే కొత్తగా ప్రారంభించిన ఈ హెలికాఫ్టర్ల తయారీ యూనిట్‌. రఫేల్‌ యుద్ధ విమానాల ఒప్పందం విషయంలో తప్పుడు ఆరోపణలతో పార్లమెంట్‌ సమయాన్ని ప్రతిపక్షాలు వృథా చేశాయి. వారందరికీ హెచ్‌ఏఎల్‌ హెలికాఫ్టర్‌ ఫ్యాక్టరీయే సమాధానం. రక్షణ రంగంలో భారత్‌ ఆత్మనిర్భరతను ఈ ఫ్యాక్టరీ మరింత పెంచుతుంది’’ అని ప్రధాని అన్నారు. ఫ్రాన్స్‌ నుంచి భారత్‌ రఫేల్‌ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు యూపీఏ (UPA) ప్రభుత్వ హయాంలో ఒప్పందం జరిగింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన భాజపా (BJP) ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వ హయాంలో ఒప్పందం చేసుకున్న ధర కంటే రెట్టింపు ధరకు యుద్ధ విమానాలను కొనుగోలు చేసిందని కాంగ్రెస్‌ ఆరోపించింది. 

2016లో మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 36 అత్యాధునిక రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు నిమిత్తం ఫ్రాన్స్‌ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఈ విమానాలను తయారు చేయాల్సిన డసో ఏవియేషన్‌ (Dassault Aviation) ఇండియా ఆఫ్‌సెట్‌ భాగస్వామిగా అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ డిఫెన్స్‌ (Reliance Defence)ను ఎంపిక చేసుకుంది. అయితే, ఎలాంటి అనుభవం లేని రిలయన్స్‌ డిఫెన్స్‌ను ఎలా చేర్చుకుంటారన్నది భారత్‌లో ప్రతిపక్షాలు కేంద్రంలోని ఎన్‌డీఏ (NDA) ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. ఆ సమయంలో హెచ్‌ఏఎల్‌ను విస్మరించి రిలయన్స్‌కు లబ్ది చేకూర్చేలా కేంద్రం  వ్యవహరించిందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు