Oral Vaccine: తయారీకి శాస్త్రవేత్తలు సిద్ధం!

నోటి ద్వారా తీసుకునే కరోనా వ్యాక్సిన్‌ను రూపొందించేందుకు కోల్‌కతాలోని ఐసీఎంఆర్‌-ఎన్‌ఐసీఈడీ శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు.

Published : 05 Jul 2021 19:34 IST

కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన ఐసీఎంఆర్‌-ఎన్‌ఐసీఈడీ

కోల్‌కతా: కరోనా వైరస్‌ను నిరోధించే వ్యాక్సిన్‌ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. అయితే, ఇప్పటివరకూ వచ్చిన వ్యాక్సిన్‌లన్నీ ఇంజక్షన్‌ రూపంలోనే తీసుకోవాల్సి ఉంది. ముక్కు ద్వారా తీసుకునే కరోనా వ్యాక్సిన్‌పై ఇప్పటికే ప్రయోగాలు జరుగుతుండగా.. తాజాగా నోటి ద్వారా తీసుకునే కరోనా వ్యాక్సిన్‌ను రూపొందించేందుకు భారత శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. ఇందుకు కోల్‌కతాలోని ఐసీఎంఆర్‌-ఎన్‌ఐసీఈడీ శాస్త్రవేత్తలు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.

నోటిద్వారా అందించే కరోనా వ్యాక్సిన్‌ (Oral Covid Vaccine)ను అభివృద్ధి చేసేందుకు భారత వైద్య పరిశోధన మండలి (ICMR)- నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కలరా అండ్‌ ఎంటెరిక్‌ డిసీజెస్‌ (NICED) శాస్త్రవేత్తలు సంకల్పించారు. ఇందుకోసం మినిస్ట్రీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి చెందిన డిపార్టుమెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ విభాగానికి తాజాగా ఓ ప్రతిపాదనను పంపించామని ఐసీఎంఆర్‌-ఎన్‌ఐసీఈడీ సంస్థ డైరెక్టర్‌ శాంతా దత్త పేర్కొన్నారు. జర్మన్‌కు చెందిన ఓ సంస్థ భాగస్వామ్యంతో ఈ పరిశోధనా ప్రాజెక్టును చేపడతామన్నారు. ఈ ప్రాజెక్టుకు అనుమతి, నిధుల సమీకరణ జరిగిన వెంటనే పరిశోధనలు ప్రారంభిస్తామని శాంతా దత్తా వెల్లడించారు. అయితే, నోటి ద్వారా తీసుకునే ఈ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడానికి ఐదు నుంచి ఆరేళ్ల సమయం పడుతుందని అంచనా వేశారు.

నోటి ద్వారా తీసుకునే కరోనా వ్యాక్సిన్‌ రూపొందించిన అనంతరం తొలుత వాటిని జంతువులపై ప్రయోగాలు జరపాల్సి ఉంటుంది. వ్యాక్సిన్‌ సురక్షితమైనదో కాదో తెలుసుకోవడంతో పాటు వైరస్‌ను నిరోధించే సామర్థ్యాన్ని అంచనా వేస్తాం. తర్వాత మాత్రమే జంతువులపై ప్రయోగిస్తామని శాంతా దత్త పేర్కొన్నారు. ఇదిలాఉంటే, ముక్కు ద్వారా తీసుకునే కరోనా వ్యాక్సిన్‌ను ఇప్పటికే భారత్‌ బయోటెక్‌ రూపొందించింది. ప్రస్తుతం వాటిపై క్లినికల్‌ ట్రయల్స్‌ కొనసాగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని