India-Canada: కెనడాకు భారత్ అల్టిమేటం.. అక్టోబరు 10లోగా దౌత్యసిబ్బందిని తగ్గించుకోవాలని డెడ్‌లైన్..!

India-Canada Diplomatic Row: భారత్‌లో కెనడా తమ దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించుకోవాలని న్యూదిల్లీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. గడువులోగా ఆ ప్రక్రియ పూర్తిచేయకపోతే.. దౌత్యవేత్తలకు భద్రతను తొలగిస్తామని హెచ్చరించినట్లు సమాచారం.

Updated : 03 Oct 2023 11:21 IST

దిల్లీ: ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ (Nijjar Killing) హత్య కేసుతో భారత్‌, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు (India-Canada Diplomatic Row) కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్‌లో వారి దౌత్య సిబ్బంది సంఖ్యను తగ్గించుకోవాలని కెనడాకు న్యూదిల్లీ అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. అక్టోబరు 10లోగా దాదాపు 40 మంది దౌత్య సిబ్బందిని వెనక్కి పిలిపించుకోవాలని ఒట్టావాకు చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఫైనాన్షియల్‌ టైమ్స్‌ కథనం వెల్లడించింది.

దౌత్యసిబ్బంది సంఖ్య విషయంలో సమానత్వం ఉండాల్సిన అవసరముందని భారత్‌ గతంలోనూ కెనడా (Canada)కు సూచించిన విషయం తెలిసిందే. ఇటీవల నిజ్జర్‌ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన భారత్‌ విదేశాంగ శాఖ.. దిల్లీ (New Delhi)లో కెనడా దౌత్యవేత్తల అంశాన్ని కూడా ప్రస్తావించింది. ఒట్టావాలోని భారత దౌత్యసిబ్బంది సంఖ్యతో పోలిస్తే దిల్లీలో కెనడా దౌత్య సిబ్బంది సంఖ్య చాలా ఎక్కువగా ఉందని, దాన్ని సమస్థాయికి తీసుకురావాలని విదేశాంగశాఖ స్పష్టం చేసింది.

మళ్లీ తెరపైకి ‘న్యూస్‌క్లిక్‌’ వివాదం.. ఆఫీసు, జర్నలిస్టుల ఇళ్లల్లో సోదాలు

ఈ క్రమంలోనే తాజాగా భారత్‌.. దౌత్యసిబ్బందిని తగ్గించుకోవాలంటూ కెనడాకు డెడ్‌లైన్‌ విధించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దిల్లీలో కెనడాకు చెందిన 62 మంది దౌత్యసిబ్బంది ఉన్నారు. అందులో 41 మందిని ఒట్టావా వెనక్కి  పిలిపించుకోవాలని చెప్పినట్లు సమాచారం. అక్టోబరు 10లోగా ఈ ప్రక్రియ పూర్తి కావాలని దిల్లీ స్పష్టం చేసిందట. ఆ తేదీ దాటిన తర్వాత కూడా అదనంగా ఉన్న సిబ్బందికి దౌత్యపరమైన రక్షణను తొలగిస్తామని భారత్‌ హెచ్చరించినట్లు సదరు కథనం వెల్లడించింది. అయితే, ఈ వార్తలపై అటు కెనడా విదేశాంగ శాఖ నుంచి గానీ, ఇటు భారత ప్రభుత్వం నుంచి గానీ ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.

నిజ్జర్‌ హత్య కేసులో భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ ట్రూడో చేసిన ఆరోపణలతో ఈ దౌత్య వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కెనడాలో మన దౌత్యవేత్తపై బహిష్కరణ వేటు పడింది. అయితే, ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన భారత్‌.. కెనడా చర్యకు ప్రతిగా కెనడా దౌత్యవేత్తను దేశం నుంచి బహిష్కరించింది. మరోవైపు, ఉద్రిక్తతల నేపథ్యంలో కెనడా వాసులకు వీసా సర్వీసులను కూడా భారత్‌ నిలిపివేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని