Agnipath Protests: అగ్నిపథ్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండానా?: తేజస్వీ యాదవ్‌

కొత్త సైనిక నియామకాల విధానం అగ్నిపథ్‌పై యువకులకు అనేక సందేహాలు ఉన్నాయని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ అన్నారు....

Published : 19 Jun 2022 14:34 IST

దిల్లీ: కొత్త సైనిక నియామకాల విధానం అగ్నిపథ్‌పై యువతకు అనేక సందేహాలు ఉన్నాయని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ అన్నారు. ఈ నేపథ్యంలో వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ బిహార్‌లో పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతోన్న విషయం తెలిసిందే.

చదువుకున్న యువతకు అగ్నిపథ్‌ విధానం ‘జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ వంటిదా? అని తేజస్వీ యాదవ్‌ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లేక ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండాలో భాగంగా దీన్ని తీసుకొచ్చారా? అని నిలదీశారు. మరోవైపు యువత శాంతియుతంగా తమ నిరసనను వ్యక్తం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు మౌనం పాటిస్తున్నారని తేజస్వీ యాదవ్‌ ప్రశ్నించారు. ‘వన్‌ ర్యాంక్‌, వన్‌ పెన్షన్‌’ గురించి మాట్లాడిన ప్రభుత్వం ఇప్పుడు ‘నో ర్యాంక్‌, నో పెన్షన్‌’ను అమల్లోకి తీసుకొస్తోందని ఎద్దేవా చేశారు. ఈ పథకంపై యువతకు అనేక సందేహాలున్నాయన్న ఆయన ప్రభుత్వానికి 20 ప్రశ్నలు సంధించారు. అగ్నిపథ్‌ను సైన్యంలోని ఉన్నతాధికారుల నియామకాలకు ఎందుకు వర్తింపజేయడం లేదని ప్రశ్నించారు.

దేశవ్యాప్తంగా అగ్నిపథ్‌పై నిరసనలు కొనసాగుతున్నాయని తేజస్వీ యాదవ్‌ గుర్తుచేశారు. సైనికులుగా మారాలనుకుంటున్న అనేక మందిలో ఈ కొత్త విధానం ఆగ్రహాన్ని కలగజేస్తోందని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో కొత్త విధానాన్ని వెంటనే ఉపసంహరించాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు బిహార్‌లో చెలరేగుతున్న హింసకు ఆర్జేడీయే కారణమన్న భాజపా ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. దీనికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని