Jaishankar: రాజకీయాలు చేయడానికీ ఓ హద్దు ఉండాలి.. జైశంకర్‌

New Parliament Building: పార్లమెంట్‌ నూతన భవనం ప్రారంభోత్సవానికి విపక్షాలు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం దురదృష్టకరమని కేంద్రమంత్రి జైశంకర్‌ అన్నారు.

Published : 26 May 2023 17:19 IST

గాంధీనగర్‌: పార్లమెంట్‌ నూతన భవనం(New Parliament Building) ప్రారంభోత్సవానికి హాజరు కాకూడదని 20 రాజకీయ పార్టీలు తీసుకున్న నిర్ణయంపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌(Jai shankar) స్పందించారు. ఆయా పార్టీల తీరు దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. రాజకీయాలు చేయడానికి కూడా ఒక హద్దు  ఉండాలని ఆక్షేపించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం గుజరాత్‌కు వచ్చిన ఆయన సంసద్‌ ఆదర్శ్‌ గ్రామ్‌ యోజనలో భాగంగా నర్మదా జిల్లాలోని తాను దత్తత తీసుకున్న నాలుగు గ్రామాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాజ్‌పిప్లా పట్టణంలో మీడియాతో మాట్లాడారు. నూతన పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవాన్ని యావత్‌ దేశం ఓ పండుగలా చేసుకోవాలన్నారు. 

ఈ నెల 28న ఆదివారం రోజు జరగబోయే నూతన పార్లమెంట్‌భవనం ప్రారంభోత్సవ అంశంపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కాకుండా ప్రధాని నరేంద్ర మోదీ ఈ భవనాన్ని ప్రారంభించడంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. 19 రాజకీయ పార్టీలు సంయుక్త ప్రకటన చేయగా.. ప్రధాని ప్రారంభోత్సవం చేస్తే తాము కూడా హాజరు కాబోమని ఎంఐఎం చీఫ్‌, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కూడా ప్రకటించారు. రాష్ట్రపతి రాజ్యాంగాధినేత మాత్రమే కాకుండా పార్లమెంట్‌ వ్యవస్థలో అంతర్భాగంగా ఉండటంతో ఆమెతోనే నూతన పార్లమెంట్‌ భవనాన్ని ప్రారంభించాలని విపక్షాలు వాదిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరుపై మాట్లాడిన జైశంకర్‌..  ఈ భవనం ప్రారంభోత్సవాన్ని ప్రజాస్వామ్యానికి ఓ పండుగలా భావించి అదే స్ఫూర్తితో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. ఇది వివాదాస్పదం కారాదని.. కానీ, అలా కావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ వ్యవహరాన్ని కొందరు వివాదాస్పదం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. కానీ, రాజకీయాలు చేయడానికి కూడా ఓ హద్దు ఉంటుందన్నారు. కనీసం ఇలాంటి సందర్భాల్లోనైనా యావత్‌ దేశమంతా కలిసికట్టుగా పండుగలా నిర్వహించుకోవాలని జైశంకర్‌ అభిప్రాయపడ్డారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని