Karnataka Polls: సంప్రదింపులు షురూ..! మరి జేడీఎస్‌ మద్దతు ఎవరికో..?

కర్ణాటక ఎన్నికల్లో (Karnataka Elections) ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవచ్చని.. జేడీఎస్‌ మరోసారి కింగ్‌మేకర్‌ అవనుందని ఎగ్జిట్‌ పోల్స్‌ (Exit Polls) అంచనా వేశాయి. దీంతో తమ మద్దతు కోసం కాంగ్రెస్‌, భాజపాలు తమను సంప్రదించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయని జేడీఎస్‌ చెబుతోంది.

Published : 12 May 2023 15:51 IST

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Elections) ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికలను జాతీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఈ తరుణంలో కాంగ్రెస్‌వైపు ఓటర్లు మొగ్గుచూపారని.. అధికార భాజపాకు ప్రతికూల ఫలితం రావొచ్చని ఎగ్జిట్‌ పోల్స్‌ (Exit Polls) అంచనా వేశాయి. దీంతో హంగ్‌ ప్రభుత్వం తప్పకపోవచ్చని.. దేవేగౌడ నేతృత్వంలోని జేడీఎస్‌ (JDS) మరోసారి ‘కింగ్‌మేకర్‌’ అయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నాయి. దీంతో భాజపా, కాంగ్రెస్‌ పార్టీలు ముందస్తుగానే జేడీఎస్‌తో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయనే వార్తలు వినిపిస్తున్నాయి.

కర్ణాటకలో కింగ్‌మేకర్‌ కాకుండా తామే ‘కింగ్‌’ అవుతామంటూ జేడీఎస్‌ నేత కుమారస్వామి మొదటి నుంచి చెబుతున్నారు. అయితే, ఎవరికి మద్దతు ఇస్తారనే విషయంపై మాత్రం ఏవిధమైన ప్రకటన చేయలేదు. అటు భాజపా, కాంగ్రెస్‌లు కూడా జేడీఎస్‌తో చేతులు కలిపే ప్రసక్తే లేదని ప్రకటనలు చేస్తున్నాయి. ఈ విషయంపై భాజపా ఇదివరకే ప్రకటన చేయగా.. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ కూడా ఎన్నికల తర్వాత జేడీఎస్‌తో పొత్తుపెట్టుకునే విషయాన్ని తోసిపుచ్చారు.

ఇప్పటికే నిర్ణయం జరిగిందా..?

మీడియా కథనాల ప్రకారం.. జేడీఎస్‌ ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకుందట. సరైన సమయంలో విషయం వెల్లడిస్తామని జేడీఎస్‌ ఓ సీనియర్‌ నేత తన్వీర్‌ అహ్మద్‌ వెల్లడించారు. కాంగ్రెస్‌, భాజపా రెండు పార్టీలు తమను సంప్రదించేందుకు ప్రయత్నాలు చేస్తాయని.. తమ మద్దతు లేకుండా ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితిలో లేవన్నారు. హెచ్‌డీ కుమారస్వామి ప్రస్తుతం సింగపూర్‌లో ఉన్నారు. సాధారణ వైద్య పరీక్షల కోసం ఆయన అక్కడికి వెళ్లినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కౌంటింగ్‌ రోజున (మే 13) కుమారస్వామి తిరిగి బెంగళూరుకు చేరుకుంటారని తెలిపాయి. అయితే, తాజా రాజకీయాలపై అక్కడ నుంచే ఆయన మంతనాలు జరుపుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

తాజా ఎన్నికల్లో కర్ణాటక ఓటర్లు కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపినట్లు మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. అయినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ ఏ పార్టీకి రాకపోవచ్చని చెప్పాయి. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని దేవేగౌడ అభిలాష మేరకు జేడీఎస్‌ కాంగ్రెస్‌కే మద్దతు ఇవ్వనుందని పార్టీ వర్గాల నుంచి వచ్చిన విశ్వసనీయ సమాచారం. ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ రణ్‌దీప్‌ సింగ్‌ సూర్జేవాలా ఇదే విషయంపై సిద్ధరామయ్యతో మంతనాలు కొనసాగిస్తున్నారు. అయితే, జేడీఎస్‌ను సంప్రదించినట్లు వస్తున్న వార్తలను భాజపా, కాంగ్రెస్‌లు తోసిపుచ్చాయి. తమకి స్పష్టమైన మెజార్టీ వస్తుందని.. సంకీర్ణ ప్రభుత్వానికి అవకాశమే లేదని భాజపా విశ్వాసం వ్యక్తం చేసింది. కాంగ్రెస్‌ కూడా తమ పార్టీ 141 సీట్లు సాధించి ఒంటరిగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు