Pak Boat: ₹400 కోట్ల డ్రగ్స్‌ కేసులో ట్విస్ట్‌.. అరెస్టయిన వారిలో డ్రగ్‌ డాన్‌ కొడుకు..!

గుజరాత్‌ తీరంలో రూ.400కోట్ల విలువైన మాదకద్రవ్యాల స్వాధీనం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారీ మాదకద్రవ్యాలతో భారత జలల్లాలోకి ప్రవేశించిన

Published : 26 Dec 2021 01:25 IST

అహ్మదాబాద్‌: గుజరాత్‌ తీరంలో రూ.400కోట్ల విలువైన మాదకద్రవ్యాల స్వాధీనం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారీ మాదకద్రవ్యాలతో భారత జలల్లాలోకి ప్రవేశించిన పాకిస్థాన్‌ ఫిషింగ్‌ బోటును గత సోమవారం అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ బోటులో ఆరుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అరెస్టయిన వారిలో ఒకరు కరాచీ డ్రగ్స్‌ డాన్‌ హజి హసన్‌ కుమారుడు మహ్మద్‌ సాజిద్‌ వాఘెర్‌ అని అధికారులు గుర్తించారు. 

కరాచీకి చెందిన హజీ హసన్‌ స్థానికంగా అతిపెద్ద డ్రగ్‌ డీలర్‌. అనేక దేశాలకు మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తూ డాన్‌గా చలామణి అవుతున్నాడు. గతంలో దుబాయిలో ఓ డ్రగ్స్‌ కేసులో అరెస్టయి ఐదేళ్ల పాటు జైల్లో ఉండి వచ్చాడు. తాజాగా భారత్‌కు రవాణా చేస్తున్న సరకుతో పాటు తన కొడుకు సాజిద్‌ను పంపించాడు. సాజిద్‌తో పాటు మరో ఐదుగురు వ్యక్తులు మత్స్యకారుల ముసుగులో 77 కిలోల హెరాయిన్‌ను ఫిషింగ్‌ బోటులో తీసుకుని కరాచీ పోర్ట్‌ నుంచి బయల్దేరారు.

అయితే కచ్ జిల్లా జాఖౌ తీరానికి 35 నాటికల్ మైళ్ల దూరంలో ఈ పడవను ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ సిబ్బంది గుర్తించారు. అనుమానాస్పదంగా కన్పించడంతో తనిఖీలు చేయగా.. భారీ ఎత్తున హెరాయిన్‌ను గుర్తించారు. అధికారులు తనిఖీలు చేస్తుండగా.. సాజిద్‌, మిగతా వ్యక్తులు పారిపోయేందుకు ప్రయత్నించారట. అయితే వారిని అడ్డగించి అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని