బిగ్‌బీ, అక్షయ్‌.. మీ సినిమాలు అడ్డుకుంటాం!

దేశంలో మండిపోతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, అక్షయ్‌ కుమార్‌ మౌనాన్ని మహారాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ నానా పటోలే.....

Published : 18 Feb 2021 18:49 IST

పెట్రో ధరలపై వైఖరి చెప్పాలని కాంగ్రెస్‌ నేత డిమాండ్‌

ముంబయి: దేశంలో మండిపోతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, అక్షయ్‌కుమార్‌ మౌనాన్ని మహారాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ నానా పటోలే ప్రశ్నించారు. రోజురోజుకీ పెరుగుతున్న ఇంధన ధరలపై తమ వైఖరేంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే వారు నటించిన సినిమాలు, షూటింగ్‌లను మహారాష్ట్రలో అనుమతించబోమని హెచ్చరించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమితాబ్‌ బచ్చన్‌, అక్షయ్‌కుమార్‌ గతంలో మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో పెట్రోల్‌ ధరలు పెరిగితే ట్వీట్లు చేశారని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు మౌనంగా ఉంటున్నారని ఆక్షేపించారు. పెట్రోల్‌ ధరల పెరుగుదలతో సామాన్యులపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. మోదీ ప్రభుత్వం అన్యాయంగా పెంచుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలపై అమితాబ్‌, అక్షయ్‌కుమార్‌ ఒక వైఖరి తీసుకోకపోతే వారి సినిమాలను, షూటింగ్‌లను మహారాష్ట్రలో అనుమతించబోమన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై గతంలోలాగే ఇప్పుడూ వారి పాత్రను పోషించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 15నుంచి ఫాస్టాగ్‌ తప్పనిసరి చేయడంపైనా నానా పటోలే విమర్శలు చేశారు.

మహారాష్ట్రతో పాటు పలు ప్రాంతాల్లో బ్రాండెడ్‌ పెట్రోల్‌ ధర రూ100 మార్కును దాటేసింది. ముంబయిలో పెట్రోల్‌ ధర రూ.96.32లుగా ఉండగా.. డీజిల్‌ ధర రూ.87.32లుగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని