Meta: ఎన్నికల్లో ఏఐ నకిలీ సమాచార కట్టడి.. మెటా ప్రత్యేక చర్యలు

సార్వత్రిక ఎన్నికల్లో ఏఐతో సృష్టించిన నకిలీ సమాచార కట్టడికి మెటా ప్రత్యేకంగా ‘ఎలక్షన్‌ ఆపరేషన్స్ సెంటర్‌’ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.

Published : 19 Mar 2024 18:32 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల (LokSabha Elections 2024) నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం (EC) షెడ్యూల్‌ను ప్రకటించడంతో రాజకీయ పార్టీల ప్రచారం ఊపందుకుంది. ఈ దఫా పార్టీలన్ని సోషల్‌ మీడియా ప్రచారంపైనే ఎక్కువగా దృష్టి సారించాయి. దీంతో ఏఐతో సృష్టించిన నకిలీ, అసత్య సమాచారం ఎక్కువ ప్రచారంలో ఉండే ప్రమాదముంది. దీన్ని కట్టడి చేసేందుకు సోషల్‌ మీడియా దిగ్గజం మెటా (Meta) ‘ఎలక్షన్‌ ఆపరేషన్స్‌ సెంటర్‌’ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. వీటిలో పనిచేసే నిపుణులు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌లలో ఏఐతో రూపొందించిన టూల్స్‌తో నకిలీ, అసత్య సమాచార వ్యాప్తిని అడ్డుకుంటారని తెలిపింది. 

‘‘ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు మా వంతు సహకారం అందిస్తాం. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆన్‌లైన్‌లో మోసపూరిత ఏఐ కంటెంట్‌ను గుర్తించేందుకు నిపుణులతో కలిసి పనిచేస్తున్నాం. నూతన సాంకేతికతతో జెన్‌ ఏఐ వంటి టూల్స్‌ను బాధ్యతాయుతంగా ఉపయోగిస్తున్నారా? లేదా? అని నిరంతరం పర్యవేక్షిస్తుంటాం. ఫ్యాక్ట్‌-చెక్‌ కోసం థర్డ్‌పార్టీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశాం. దేశవ్యాప్తంగా 15 భాషల్లో 11 ఫ్యాక్ట్‌-చెక్‌ బృందాలతో జట్టు కట్టాం. అదనంగా 15 వేల మంది 20 భారతీయ భాషల్లో ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్, థ్రెడ్‌లో వచ్చే కంటెంట్‌ను సమీక్షిస్తుంటారు. ఇందుకోసం 2019 నుంచి స్వచ్ఛందంగా ఈసీతో కలిసి పనిచేస్తున్నాం’’ అని మెటా వెల్లడించింది. 

ఎన్నికల ప్రచారం వయా సోషల్‌ మీడియా

ఎన్నికల సమయంలో తప్పుడు సమాచారం వ్యాపించకుండా, అధికారిక సమాచారాన్ని ప్రజలకు సులువుగా అందించడం కోసం ఈసీతో గూగుల్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఏఐ జనరేటెడ్‌, డీప్‌ఫేక్‌ కంటెంట్‌తోపాటు తప్పుడు ప్రకటనలను అడ్డుకుంటామని తెలిపింది. ఇవేకాకుండా డ్రీమ్‌ స్క్రీన్‌ వంటి యూట్యూబ్‌ జనరేటివ్‌ ఏఐ ఫీచర్లతో క్రియేట్‌ చేసిన కంటెంట్‌పైనా ఇప్పటికే లేబుల్స్‌ ప్రదర్శించడమూ ప్రారంభించినట్లు గూగుల్‌ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని