Law Ministry: న్యాయశాఖలో మరో మార్పు.. సహాయ మంత్రినీ తొలగించారు..!

న్యాయశాఖ (Law Ministry) సహాయ మంత్రి ఎస్‌పీ సింగ్‌ బఘేల్‌ను మరో శాఖకు బదిలీ చేశారు. న్యాయశాఖను కేంద్రమంత్రి అర్జున్‌ రామ్‌మేఘ్వాల్‌కు అప్పగించిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

Published : 18 May 2023 22:20 IST

దిల్లీ: కేంద్ర న్యాయశాఖ (Law Ministry) బాధ్యతల నుంచి కిరణ్‌ రిజిజు (Kiren Rijiju)ను తొలగిస్తూ ఈ ఉదయం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే న్యాయశాఖ మరో మార్పు చోటుచేసుకుంది. రిజిజు డిప్యూటీని కూడా ఆ బాధ్యతల నుంచి తప్పించారు. న్యాయశాఖ సహాయ మంత్రిగా ఉన్న ఎస్‌.పి. సింగ్‌ బఘేల్‌ (S P Singh Baghel)ను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ (Health and Family Welfare) శాఖ సహాయ మంత్రిగా బదిలీ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.

న్యాయశాఖ మంత్రిగా ఉన్న కిరణ్‌ రిజిజు (Kiren Rijiju)ను తొలగించి ఆ శాఖను కేంద్ర సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ (Arjun Ram Meghwal)కు అప్పగించిన విషయం తెలిసిందే. న్యాయశాఖకు ఆయన స్వతంత్ర మంత్రిగా మేఘ్వాల్‌ ఈ బాధ్యతలు స్వీకరించారు. అయితే, సంప్రదాయం ప్రకారం.. ఓ శాఖను స్వతంత్ర హోదాలో నిర్వహిస్తున్న మంత్రికి డిప్యూటీ ఉండరు. అందుకే.. ఎస్‌.పి. బఘేల్‌ను మరో శాఖకు పంపించినట్లు అధికారులు వెల్లడించారు.

కిరణ్‌ రిజిజుకు భూ విజ్ఞానశాస్త్ర (Ministry of Earth Sciences) మంత్రిత్వ బాధ్యతలను అప్పగించారు. దీనిపై రిజిజు (Kiren Rijiju) ట్విటర్‌లో స్పందించారు. ‘‘ప్రధాని మోదీజీ నేతృత్వంలో న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం గర్వంగా భావిస్తున్నా. దేశ పౌరులకు త్వరితగతిన న్యాయసేవలు అందించడంలో అండగా నిలిచిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై చంద్రచూడ్‌, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థలోని ప్రతి అధికారి, సిబ్బందికి నా కృతజ్ఞతలు. ఇప్పుడు అదే ఉత్సాహంతో భూవిజ్ఞాన శాఖ బాధ్యతలు చేపట్టి.. మోదీజీ ఆశయాలను సాకారం చేసేందుకు కృషి చేస్తాను’’ అని ఆయన రాసుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని