Navjot Singh Sidhu: సిద్ధూ @ ఖైదీ నంబరు 241383.. జైల్లో తొలిరోజు ఎలా గడిచిందంటే..

మూడు దశాబ్దాల నాటి కేసులో ఏడాది జైలు శిక్ష పడటంతో పంజాబ్‌ కాంగ్రెస్‌ మాజీ చీఫ్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ నిన్న కోర్టులో లొంగిపోయారు. దీంతో ఆయనను పటియాలా సెంట్రల్‌ జైలుకు తరలించారు. జైలు లోపలికి వెళ్లిన

Updated : 21 May 2022 15:22 IST

పటియాలా: మూడు దశాబ్దాల నాటి కేసులో ఏడాది జైలు శిక్ష పడటంతో పంజాబ్‌ కాంగ్రెస్‌ మాజీ చీఫ్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ నిన్న కోర్టులో లొంగిపోయారు. దీంతో ఆయనను పటియాలా సెంట్రల్‌ జైలుకు తరలించారు. జైలు లోపలికి వెళ్లిన తర్వాత సిద్ధూకు ఖైదీ నంబరు 241383 కేటాయించారు. 10 నంబరు గదిలో ఉంచినట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఆయనతో పాటు అదే సెల్‌లో మరో 8 మంది ఖైదీలు ఉన్నట్లు తెలుస్తోంది.

జైల్లో తొలి రోజు సిద్ధూకు కాస్త కష్టంగానే గడిచినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. నిన్న రాత్రి ఆయనకు రోటి, పప్పు వడ్డించగా.. ఆరోగ్య కారణాల రీత్యా ఆయన వాటిని తిరస్కరించినట్లు తెలిపాయి. కేవలం సలాడ్‌, కొన్ని పండ్లు తిని మిగతా ఖైదీల్లాగే సిమెంట్ బెడ్‌పై పడుకున్నారట. సిద్ధూకు కాలేయ సమస్యతో పాటు గోధుమల అలెర్జీ ఉంది. అందువల్ల తనకు ప్రత్యేక డైట్ కావాలని జైలు అధికారులను కోరినట్లు ఆ వర్గాలు తెలిపాయి. జైల్లో సిద్ధూకు నాలుగు జతల కుర్తా-పైజామాలు, ఒక టేబుల్‌, కుర్చీ, కప్‌బోర్డు, రెండు తలపాగాలు, ఒక జత బూట్లు, పెన్ను తదితర వస్తువులు ఇచ్చినట్లు పేర్కొన్నాయి.

కాగా.. ఇదే జైలులో శిరోమణి అకాలీదళ్‌ నేత బిక్రమ్‌ సింగ్‌ మజీతియా కూడా శిక్ష అనుభవిస్తున్నారు. డ్రగ్స్‌ కేసులో ఆయన అరెస్టయిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అమృత్‌సర్‌ తూర్పు నుంచి సిద్ధూ, మజీతియా ప్రత్యర్థులుగా పోటీ చేశారు. అయితే ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థి జీవన్‌జోత్‌ కౌర్‌ చేతిలో వీరిద్దరూ ఓటమిపాలయ్యారు.

కేసు నేపథ్యమిదీ..

34 ఏళ్ల క్రితం ఓ వృద్ధుడిపై దాడి చేసి అతడి మరణానికి కారణమైన కేసులో సిద్ధూకు గత గురువారం సుప్రీం కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. 1988 డిసెంబరు 27న.. సిద్ధూ, ఆయన స్నేహితుడైన రూపిందర్‌సింగ్‌ సంధూ పటియాలాలో రోడ్డు మధ్యలో జిప్సీ ఆపి ఉంచారు. ఆ మార్గంలో వచ్చిన గుర్నాంసింగ్‌ (65) వాహనాన్ని పక్కకు తీయమని పదే పదే కోరారు. ఆవేశంతో మిత్రులు ఇద్దరూ వృద్ధుణ్ని కారు నుంచి బయటకు లాగి చితకబాదారన్నది ఈ కేసులో అభియోగం. గాయపడిన గుర్నాంసింగ్‌ను ఆసుపత్రికి తరలించగా, మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సరైన సాక్ష్యాధారాలు లేవంటూ 1999లో పటియాలా జిల్లా సెషన్స్‌ కోర్టు ఈ కేసులోని నిందితులు ఇద్దరికీ హత్య ఆరోపణల నుంచి విముక్తి కల్పించింది.

ఆ తర్వాత పంజాబ్, హరియాణా హైకోర్టుకు చేరిన ఈ కేసులో 2006 నాటి తీర్పు బాధితుడి పక్షాన వచ్చింది. సిద్ధూకు మూడేళ్ల జైలుశిక్ష పడింది. ఈ తీర్పును 2018 మే 15న తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ఓ సీనియర్‌ సిటిజన్‌ను గాయపరిచినందుకు సిద్ధూకు రూ.వెయ్యి జరిమానా విధించింది. ఆ సమయంలో సిద్ధూ వెంట తను ఉన్నట్లు నమ్మదగ్గ సాక్ష్యాలు లేవంటూ రూపిందర్‌సింగ్‌ సంధూను కేసు నుంచి విముక్తుణ్ని చేసింది. దీనిపై అదే ఏడాది సెప్టెంబరులో గుర్నాంసింగ్‌ కుటుంబం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ పరిశీలనకు అంగీకరించిన సుప్రీంకోర్టు.. సిద్ధూకు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని