NEET 2023: నీట్‌ పరీక్షలో మళ్లీ దారుణాలు.. డ్రెస్‌లు మార్పించి.. లోదుస్తులనూ తనిఖీ చేసి..!

నీట్‌ పరీక్ష (NEET UG 2023)లో డ్రెస్‌కోడ్‌ విధానం మరోసారి విమర్శలకు దారితీసింది. కొన్ని చోట్ల అమ్మాయిల లోదుస్తులను తనిఖీ చేయగా.. మరికొన్ని చోట్ల కొందరు అప్పటికప్పుడు కొత్త డ్రెస్సులు కొనుక్కుని పరీక్ష రాయాల్సి వచ్చినట్లు కథనాలు వెలువడుతున్నాయి.

Updated : 09 May 2023 17:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వైద్య కళాశాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ (NEET UG 2023) పరీక్షలో తనిఖీల విధానాలు అనేకసార్లు వివాదాస్పదమయ్యాయి. కొన్ని పరీక్షా కేంద్రాల్లో తనిఖీల పేరుతో సిబ్బంది అవమానకరంగా వ్యవహరించిన ఘటనలు గతంలో వెలుగుచూశాయి. తాజాగా ఈ ఏడాది జరిగిన నీట్‌ పరీక్షలోనూ అలాంటి ఘటనలు పునారవృతం కావడం చర్చనీయాంశంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో లోదుస్తులను కూడా తనిఖీ (Checking) చేయగా.. మరికొన్ని చోట్ల డ్రెస్సులు మార్చుకుని రావాలని చెప్పినట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లో ఈ ఘటనలు చోటుచేసుకున్నట్లు సమాచారం.

గత ఆదివారం (మే 7వ తేదీన) దేశవ్యాప్తంగా దాదాపు 4వేల కేంద్రాల్లో నీట్‌ యూజీ (NEET UG 2023) ప్రవేశ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. దాదాపు 20లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. అయితే ఈ పరీక్ష రాసేందుకు వెళ్లిన తమతో తనిఖీల పేరుతో అక్కడి సిబ్బంది అమానవీయంగా ప్రవర్తించారని కొందరు విద్యార్థులు సోషల్‌మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర (Maharashtra)లోని సంగ్లీ ప్రాంతంలో ఓ పరీక్షా కేంద్రం వద్ద.. అమ్మాయిల లోదుస్తుల హుక్స్‌ను కూడా తనిఖీ చేశారని, కొంతమంది కుర్తాలను విప్పించి వాటిని తిరగేసుకోమని చెప్పారని ఓ వైద్య దంపతులు మీడియాకు తెలిపారు. అదే కేంద్రంలో పరీక్ష రాసిన తమ కుమార్తె ఈ విషయాన్ని చెప్పినట్లు పేర్కొన్నారు.

హిండ్‌మోటార్‌ (పశ్చిమ బెంగాల్‌ West Bengal) ప్రాంతంలోని హెచ్‌ఎంసీ పరీక్షా కేంద్రంలో నీట్‌ పరీక్ష (NEET Exam)కు హాజరైన ఓ విద్యార్థి.. అక్కడ కొందరికి ఎదురైన అనుభవాలను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘‘చాలా మంది అభ్యర్థుల లోదుస్తులను కూడా తనిఖీ చేశారు. జీన్స్ వేసుకొచ్చిన అమ్మాయిలను లోనికి అనుమతించలేదు. దీంతో వారు తమతో పాటు వచ్చిన తల్లి లేదా ఇతర బంధువుల డ్రెస్‌లను మార్చుకుని వేసుకున్నారు. అలా కుదరని కొందరు సమీపంలోని దుకాణాలకు వెళ్లి అప్పటికప్పుడు కొత్త దుస్తులు కొనుక్కున్నారు. పొడవు చేతులున్న షర్ట్‌లు వేసుకుని వచ్చిన కొందరు అబ్బాయిలు తమ తండ్రుల చొక్కాలను మార్చుకున్నారు. జీన్స్‌లను అనుమతించకపోవడంతో కొందరు అబ్బాయిలు చివరి నిమిషంలో ఇన్నర్‌వేర్‌తోనే పరీక్షా కేంద్రంలోనికి వెళ్లాల్సి వచ్చింది’’ అని ఆ విద్యార్థి సోషల్‌మీడియాలో రాసుకొచ్చారు.

దీంతో ఈ ఘటనలు వివాదానికి తెరలేపాయి. అయితే, ఈ వార్తలపై హెచ్‌ఎంసీ పరీక్షా కేంద్రం ప్రిన్సిపల్‌ స్పందించారు. డ్రెస్‌ కోడ్‌ (Dress Code) నిబంధనలను విరుద్ధంగా కొందరు ఎక్కువ జేబులు ఉన్న ప్యాంట్లు ధరించారని, వారినే దుస్తులు మార్చుకురావాలని చెప్పినట్లు తెలిపారు. గతేడాది కేరళలోని కొల్లాంలో ఇలాంటి ఘటనలే చోటుచేసుకోగా.. దానిపై తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని