Chhattisgarh Polls: 23 ఏళ్లయినా.. ఆ ‘తొమ్మిది’ కమలానికి అందని ద్రాక్షే!

ఛత్తీస్‌గఢ్‌ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత భాజపా వరుసగా మూడు పర్యాయాలు రాష్ట్రాన్ని పాలించినప్పటికీ.. తొమ్మిది నియోజకవర్గాల్లో మాత్రం ఇప్పటివరకు కాషాయ జెండా ఎగరవేయలేదు.

Published : 27 Oct 2023 18:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh Polls) ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ఆ తర్వాత వరుసగా మూడు పర్యాయాలు రాష్ట్రాన్ని భాజపానే ఏకధాటిగా పాలించింది. అయినప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం కాషాయ పార్టీకి (BJP) గెలుపు అనేది అందని ద్రాక్షలాగే మిగిలింది. ముఖ్యంగా తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో భాజపా జెండా ఇప్పటికీ ఎగరలేదు. ఈ నేపథ్యంలో ఈ సారి వీటిని లక్ష్యంగా పెట్టుకున్న భాజపా.. కీలక స్థానాల్లో కొత్త ముఖాలను బరిలోకి దించి అధికార కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది.

మధ్యప్రదేశ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌ 2000లో విడిపోగా.. ఆ తర్వాత వరుసగా మూడు అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) భాజపా పూర్తి మెజార్టీని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మొత్తం అక్కడ 90 అసెంబ్లీ స్థానాలుండగా.. 2003లో 50, 2008లో 50, 2013లో 49 సీట్లు సాధించి కాషాయ పార్టీ అధికారం చేపట్టింది. వరుసగా మూడుసార్లు సీఎంగా కొనసాగిన రమణ్‌సింగ్‌ (Raman Singh) దూకుడుకు 2018లో కాంగ్రెస్‌ అడ్డుకట్ట వేసింది. క్రితం ఎన్నికల్లో 68 సీట్లతో కాంగ్రెస్‌ విజయం సాధించగా.. భాజపా మాత్రం 15 సీట్లతోనే సరిపెట్టుకుంది.

అక్కడ వికసించని కమలం..

23ఏళ్ల క్రితం రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తొమ్మిది నియోజకవర్గాల్లో కాషాయ జెండా ఇప్పటికీ ఎగరలేదు. వీటిలో సీతాపుర్‌, పాలీ-తానాఖర్‌, మర్వాహీ, మోహ్‌లా-మాన్‌పుర్‌, కోంటా నియోజక వర్గాలు ఎస్టీ కేటగిరికి చెందినవి కాగా.. ఖార్‌సియా, కోర్బా, కోటా, జైజైపుర్‌లు మాత్రం జనరల్‌ కేటగిరి కిందకు వస్తాయి.

కోంటా నియోజకవర్గ ఎమ్మెల్యేగా బస్తర్‌ ప్రాంతానికి చెందిన గిరిజన నేత, కాంగ్రెస్‌ తరఫున ఐదుసార్లు ఎమ్మెల్యే కవాసీ లఖ్మా ఉన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన కోంటాలో 1998 నుంచి తిరుగులేని నేతగా, ప్రస్తుతం మంత్రిగా లఖ్మా కొనసాగుతున్నారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా పనిచేసిన సల్వా జుడుం మాజీ కార్యకర్త సోయం ముక్కాను ఈసారి భాజపా రంగంలోకి దింపింది. దీంతో భాజపా, కాంగ్రెస్‌,  సీపీఐ మధ్య ఈసారి త్రిముఖ పోటీ నెలకొన్నట్లయ్యింది.

‘బస్తర్‌’ మే సవాల్‌

సీతాపుర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే అమర్‌జిత్‌ భగత్‌కు కూడా గిరిజన నేతగా మంచి పేరుంది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ ఆయనే ఎమ్మెల్యేగా ఎన్నికవుతున్నారు. ప్రస్తుతం భూపేశ్‌ బఘేల్‌ (Bhupesh Baghel) ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఈయనపై సీఆర్‌పీఎఫ్‌ (CRPF)కు రాజీనామా చేసి వచ్చిన రామ్‌ కుమార్‌ తొప్పోను భాజపా బరిలో దింపింది.

ఖార్‌సియా అసెంబ్లీ స్థానం నుంచి రెండుసార్లు గెలుపొందిన ఉమేశ్‌ పటేల్‌ ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. రాష్ట్రం ఏర్పడకముందు ఎన్నో దశాబ్దాల నుంచి (1977) ఈ అసెంబ్లీ స్థానం కాంగ్రెస్‌కు కంచుకోట. ఉమేశ్‌ పటేల్‌ తండ్రి నంద్‌ కుమార్‌ పటేల్‌ గతంలో కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఇదే స్థానం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈయన.. 2013లో బస్తర్‌లో జరిగిన మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఇక్కడ మహేశ్‌ సాహును భాజపా పోటీలోకి దించింది.

మర్వాహీ, కోటా నియోజకవర్గాలు ఎంతోకాలంగా కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండగా.. 2018 ఎన్నికల్లో మర్వాహీలో జనతా కాంగ్రెస్‌ ఛత్తీస్‌గఢ్‌ (జేసీసీ) విజయం సాధించింది. మర్వాహీలో కాంగ్రెస్‌ నుంచి 2001, 2003, 2008లో మాజీ సీఎం అజిత్‌ జోగీ గెలవగా.. 2013లో ఆయన కుమారుడు అమిత్‌ జోగీ పోటీ చేసి గెలుపొందారు. తర్వాత జేసీసీ తరఫున అజిత్‌ జోగీ పోటీచేసి విజయం సాధించారు. అయితే, 2020లో అజిత్‌ జోగీ మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఆ స్థానాన్ని కాంగ్రెస్‌ చేజిక్కించుకుంది.

హోరాహోరీగా ఛత్తీస్‌గఢ్‌ పోరు

కోటా స్థానం నుంచి అజిత్‌ జోగీ భార్య రేణు జోగి 2006లో కాంగ్రెస్‌ తరఫున గెలుపొందారు. అనంతరం 2008, 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి, 2018లో జేసీసీ నుంచి (నాలుగోసారి) రేణు జోగీ విజయం సాధించారు. ఈ క్రమంలో భాజపా రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు ప్రభల్‌ ప్రతాప్‌ సింగ్‌ జుదేవ్‌ను కోటా నుంచి, మార్వాహీ నుంచి భారత సైన్యంలో పనిచేసిన ప్రణవ్‌ కుమార్‌ మార్పచ్ఛీలను భాజపా రంగంలోకి దింపింది.

కోర్‌బా, పాలీ-తానాఖర్‌, జైజైపుర్‌, మోహ్‌లా-మాన్‌పుర్‌ ఈ నాలుగు చోట్ల భాజపా ఖాతా తెరవలేదు. 2008 నుంచి కోర్బా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న జైసింగ్‌ అగర్వాల్‌, ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. ఇక్కడ నుంచి లఖన్‌లాల్‌ దేవాంగన్‌ను, పాలీ-తానాఖర్‌ నుంచి రామ్‌దయాళ్‌ ఉకేను భాజపా పోటీలో దింపింది. జైజైపుర్‌ మాత్రం గత రెండు పర్యాయాలుగా బీఎస్పీ చేతిలో ఉంది. ఈసారి కాంగ్రెస్‌, భాజపా నుంచి గట్టి పోటీ ఎదుర్కోనుంది. మోహ్‌లా-మాన్‌పుర్‌ ఎమ్మెల్యేగా ఉన్న ఇంద్రశాహ్‌ మండావీని కాంగ్రెస్‌ బరిలో ఉంచగా.. ఆయనపై మాజీ ఎమ్మెల్యే సంజీవ్‌ షాను భాజపా బరిలో దింపింది.

కాంగ్రెస్‌కూ మూడుచోట్ల ఇదే పరిస్థితి..

భాజపా మాదిరిగానే కాంగ్రెస్‌ కూడా మూడుచోట్ల ఇప్పటికీ ఖాతా తెరవలేదు. 2008లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా రాయ్‌పుర్‌ సిటీ సౌత్‌, వైశాలీ నగర్‌, బెల్‌తరాలు ఏర్పడ్డాయి. అప్పటి నుంచి కాంగ్రెస్‌ ఇక్కడ గెలుపొందలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని