Tihar Jail: జైల్లో గ్యాంగ్‌స్టర్‌ హత్య.. 90 మంది సిబ్బంది బదిలీ

గ్యాంగ్‌స్టర్‌ టిల్లు తాజ్‌పురియా హత్య ఘటనలో తిహాడ్ జైలు సిబ్బందిపై తీవ్ర విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. పెద్ద సంఖ్యలో జైలు సిబ్బందిని బదిలీ చేశారు.

Published : 12 May 2023 00:49 IST

దిల్లీ:  తిహాడ్‌ జైల్లో (Tihar Jail)లో గ్యాంగ్‌స్టర్‌ టిల్లు తాజ్‌పురియా (Tillu Tajpuriya) దారుణ హత్యకు గురైన కేసులో జైలు సిబ్బందిపై బదిలీ వేటు పడింది. ఈ మేరకు తిహాడ్ జైలు డీజీ సంజయ్‌ బెనివాల్ 90 మంది సిబ్బందిని బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో జైలు అసిస్టెంట్ సూపరిండెంట్‌, డిప్యూటీ సూపరింటెండ్‌ సహా హెడ్‌ వార్డెన్‌, వార్డెన్‌లు ఉన్నారు. కొద్దిరోజుల్లో మరిన్ని బదిలీలు ఉంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. టిల్లు తాజ్‌పురియా హత్య అనంతరం జైలు సిబ్బంది తీరుపై తీవ్ర విమర్శలు రావడంతో ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం. 

దిల్లీకి చెందిన గ్యాంగ్‌స్టర్‌ టిల్లు తాజ్‌పురియా తిహాడ్‌ జైల్లో మే 2వ తేదీన దారుణ హత్యకు గురయ్యాడు. జైల్లోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో హై రిస్క్‌ వార్డ్‌లో ఉన్న టిల్లుపై తోటి ఖైదీలు, మరో గ్యాంగ్‌స్టర్‌ గోగి గ్యాంగ్‌ సభ్యులు దాడి చేసి చంపేశారు. హత్యకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయింది. టిల్లును ప్రత్యర్థులు 90 సార్లు పొడిచి చంపినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో తేలింది. పోలీసుల ఎదుటే ప్రత్యర్థి గ్యాంగ్‌ పదే పదే టిల్లుపై దాడి చేశారు. దీంతో పోలీసుల పాత్రపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే తిహాడ్‌ జైలు డీజీ 90 మంది సిబ్బందిపై బదిలీ వేటు వేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని