Swachh Bharat 2.0: స్వచ్ఛ భారత్‌ మిషన్‌ 2.0ను ప్రారంభించిన మోదీ

పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు చెత్త నుంచి విముక్తితో పాటు తాగునీటి భద్రత కల్పించే రెండో దశ స్వచ్ఛ భారత్‌ మిషన్‌ (SBM-U 2.0), అమృత్‌ (AMRUT 2.0) కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.

Published : 01 Oct 2021 21:41 IST

దిల్లీ: పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు చెత్త నుంచి విముక్తితో పాటు తాగునీటి భద్రత కల్పించే రెండో దశ స్వచ్ఛ భారత్‌ మిషన్‌ (SBM-U 2.0), అమృత్‌ (AMRUT 2.0) కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. దిల్లీలోని అంబేద్కర్‌ ఇంటర్నేషనల్‌ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మోదీ.. వేగంగా జరుగుతున్న పట్టణీకరణలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడం, 2030 నాటికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగానే ఈ రెండు కార్యక్రమాలను రూపొందించినట్లు వెల్లడించారు. వీటికోసం దాదాపు రూ.4.28 లక్షల కోట్లను ఖర్చు చేయనున్నట్లు వివరించారు. స్వచ్ఛ భారత్‌ 2.0కి రూ.1.41 లక్షల కోట్లు కాగా అమృత్‌ పథకానికి రూ.2.87 లక్షల కోట్లను ఖర్చు చేస్తామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

పట్టణాల్లో స్వచ్ఛ భారత్‌ రెండో దశ కార్యక్రమం కింద ఆయా ప్రాంతాల్లో మురుగు నీటి నిర్వహణను చేపట్టనున్నారు. అన్ని పట్టణ స్థానిక సంస్థలను ODF ప్లస్‌ (బహిరంగ మల విసర్జన రహితం)గా మార్చే కార్యక్రమాలు చేపడతారు. అంతేకాకుండా లక్ష జనాభాకు పైబడిన పట్టణాలను ODF ప్లస్‌ప్లస్‌గా తీర్చిదిద్దుతారు. తద్వారా పట్టణాలు స్వచ్ఛమైన ప్రాంతాలుగా మార్చే లక్ష్యాన్ని చేరుకుంటాయి. వీటితోపాటు ఘన వ్యర్థాలను వేరు చేయడంపై దృష్టి సారించడంతోపాటు వాటి పునర్వినియోగం, పునఃశుద్ధి చేయడంపైనా దృష్టి కేంద్రీకరిస్తారు. మున్సిపాల్టీల్లో వెలువడే అన్నిరకాల వ్యర్థాలను శాస్త్రీయంగా శుద్ధిచేసి, వాటిని సమర్థవంతంగా వినియోగిస్తారు. ఈ స్వచ్ఛభారత్‌-2.0కి కేంద్ర ప్రభుత్వం రూ.1.41 లక్షల కోట్లు ఖర్చు చేస్తుంది.

ఇక అమృత్‌ 2.0 కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా ఉన్న 4,700 పట్టణ స్థానిక సంస్థల్లో 2.68 కోట్ల నల్లా కనెక్షన్లు ఇచ్చి ప్రతి ఇంటికీ తాగునీటి సౌకర్యాన్ని కల్పిస్తారు. 500 అమృత్‌ పట్టణాల్లో ఇళ్లకు మురుగు వ్యర్థాల కనెక్షన్లు ఇస్తారు. దీనివల్ల పట్టణ ప్రాంతాల్లో ఉన్న 10.5 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇందులో భాగంగా ఉపరితల, భూగర్భ జలాలను సంరక్షించడంతో పాటు, వాటి పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటారు. ఇందుకోసం ప్రపంచస్థాయి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు. పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సౌకర్య కల్పన పురోగతిని తెలుసుకొనేందుకు తాగునీటి సర్వేకూడా చేపడతారు. ఈ మొత్తం కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం రూ.2.87 లక్షల కోట్లు కేటాయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు