Modi: నాలుగేళ్లలో మోదీ 21 విదేశీ పర్యటనలు.. ఖర్చెంతో తెలుసా?

ప్రధాని మోదీ గత నాలుగేళ్లలో 21 సార్లు విదేశాల్లో పర్యటించారు. ఇందుకు ప్రభుత్వం చేసిన ఖర్చును కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది.

Published : 02 Feb 2023 18:38 IST

దిల్లీ: నాలుగేళ్ల క్రితం 2019లో రెండోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మోదీ (Modi) 21 సార్లు విదేశీ పర్యటనలు చేశారు. మరి ఈ పర్యటనలకు ప్రభుత్వం చేసిన ఖర్చు.. అక్షరాలా రూ.22.76కోట్లు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గురువారం పార్లమెంట్‌కు వెల్లడించింది.

2019 నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటన (Foreign Visits)ల కోసం రూ.22.76కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర విదేశాంగ శాఖ (MEA) సహాయ మంత్రి వి. మురళీధరన్‌ రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ఈ నాలుగేళ్లలో ప్రధాని మొత్తం 21 సార్లు విదేశాల్లో పర్యటించగా.. జపాన్‌కు మూడు సార్లు, అమెరికాకు రెండు, యునైటెడ్‌ అరబ్‌కు రెండు సార్లు వెళ్లినట్లు ఆయన తెలిపారు.

ఇక, 2019 నుంచి రాష్ట్రపతి (President) 8సార్లు విదేశీ పర్యటనలు చేయగా.. అందుకు రూ.6.24కోట్లు ఖర్చయినట్లు కేంద్రమంత్రి మురళీధరన్‌ వెల్లడించారు. ఇందులో ఏడు పర్యటనలు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ చేయగా.. ప్రస్తుత ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము ఒకసారి యూకే పర్యటనకు వెళ్లారు. అటు, కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ 2019 నుంచి మొత్తం 86 సార్లు విదేశాల్లో పర్యటించారు. ఇందుకోసం రూ.20.87కోట్లు ఖర్చయినట్లు మురళీధరన్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని