TMC Vs IPAC: ఓ ‘కాంట్రాక్టర్‌’ చేతిలో రాజకీయ పార్టీ నడపలేరు..!

రాజకీయ పార్టీలు ఓ కాంట్రాక్టర్‌ చేతిలో నడవడమేంటని తృణమూల్‌ ఎంపీ చేసిన వ్యాఖ్యలు తాజాగా ఆ పార్టీలో మరోసారి అగ్గి రాజేస్తోంది.

Published : 23 Feb 2022 01:41 IST

ప్రశాంత్‌ కిశోర్‌పై తృణమూల్‌ ఎంపీ పరోక్ష వ్యాఖ్యలు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ హ్యాట్రిక్‌ విజయం సాధించడంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఆయన స్థాపించిన ఐ-పాక్‌ (ఇండియన్‌ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ) సంస్థ వ్యవహారం ఆ పార్టీలో కొందరు నేతలకు మింగుడుపడడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఓ కాంట్రాక్టర్‌ చేతిలో నడవడమేంటని తృణమూల్‌ ఎంపీ చేసిన వ్యాఖ్యలు తాజాగా ఆ పార్టీలో మరోసారి అగ్గి రాజేస్తోంది. ఇదే సమయంలో గోవాలోనూ ప్రశాంత్‌ కిశోర్‌ బృందం తీరుపట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆ రాష్ట్ర తృణమూల్‌ చీఫ్‌ పార్టీ వీడుతారనే వార్తలు వచ్చాయి. దీంతో తృణమూల్‌ నేతలు, ప్రశాంత్‌ కిశోర్‌ బృందం మధ్య ఘర్షణ వాతావరణం పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

‘ఓ రాజకీయ పార్టీ, రాజకీయ పార్టీ మాదిరిగానే నడవాలి. అంతేకానీ ఓ కాంట్రాక్టర్‌ చేతిలో కాదు’ అంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్లమెంట్‌ సభ్యుడు కల్యాణ్‌ బెనర్జీ వ్యాఖ్యానించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గంలో తనను సంప్రదించకుండానే మునిసిపల్‌ కార్పొరేషన్‌లో బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల నియామకాన్ని ఐ-పాక్‌ బృందం చేపట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. ఐ-పాక్‌ తమ జీవితాలను దీనస్థితిలోకి జార్చుతోందని మండిపడ్డారు.

ప్రశాంత్‌ కిశోర్‌పై అసంతృప్తి..

గోవాలో తృణమూల్‌ కాంగ్రెస్‌కు రాజకీయ సలహాదారుగా ఉన్న ఐ-పాక్‌ బృందం ఇటీవల అసెంబ్లీ ఎన్నికల తర్వాత తమ అభ్యర్థులను వదిలేసిందని ఆ పార్టీ గోవా చీఫ్ కిరణ్‌ కండోల్కర్‌ ఆరోపించారు. ఈ విషయంలో ప్రశాంత్‌ కిశోర్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నప్పటికీ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడం లేదన్నారు. ‘ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరికీ ఐ-పాక్‌తో కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటి గురించి పార్టీ నేతలతో చర్చించినప్పుడు, అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని వారందరూ నాకు సలహా ఇచ్చారు. అయినప్పటికీ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి నేను వైదొలగడం లేదు. కానీ, ప్రశాంత్‌ కిశోర్‌తోపాటు ఆయన బృందంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాను’ అని కిరణ్‌ కండోల్కర్‌ స్పష్టం చేశారు.

ఇదిలాఉంటే, పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ మూడోసారి అధికారంలోకి రావడానికి ప్రశాంత్‌ కిశోర్‌ బృందం వేసిన వ్యూహాలు ఎంతగానో ఉపయోగపడినట్లు ఆ పార్టీ భావిస్తోంది. అందుకే వచ్చే ఎన్నికల వరకూ ఐ-పాక్‌తో కలిసి పనిచేసేందుకు అవగాహన కుదుర్చుకుంది. ఈ సమయంలోనే గోవా అసెంబ్లీ ఎన్నికలకు పీకే బృందాన్ని రంగంలోకి దింపింది. ఫిబ్రవరి 14న అక్కడ పోలింగ్‌ పూర్తికాగా మార్చి 10 ఫలితాలు వెలువడనున్నాయి. ఇదే సమయంలో ప్రశాంత్‌ కిశోర్‌, ఆయన బృందంపై తృణమూల్‌ నేతల నుంచి విమర్శలు ఎక్కువ కావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని