Supreme Court: ఉక్రెయిన్‌ నుంచి భారతీయుల తరలింపు భేష్‌.. కేంద్రానికి సుప్రీం ప్రశంస

భారతీయుల తరలింపు కోసం కేంద్రం చేపడుతున్న చర్యలను సుప్రీంకోర్టు ప్రశంసించింది. అయితే వారు వచ్చేవరకు కుటుంబాలు ఎదుర్కొంటున్న ఒత్తిడిపై ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది......

Published : 04 Mar 2022 22:30 IST

దిల్లీ: ఉక్రెయిన్​లో చిక్కుకుపోయిన భారతీయుల్లో ఇప్పటివరకు 17వేల మందిని స్వదేశానికి తరలించామని కేంద్రం సమర్పించిన నివేదికను సుప్రీంకోర్టు నేడు పరిశీలించింది. భారతీయుల తరలింపు కోసం కేంద్రం చేపడుతున్న చర్యలను ప్రశంసించింది. అయితే వారు వచ్చేవరకు కుటుంబాలు ఎదుర్కొంటున్న ఒత్తిడిపై ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. వీరి కోసం ఆన్​లైన్ హెల్ప్​డెస్క్​ ఏర్పాటు చేయాలని చీఫ్‌ జస్టిస్‌ ఎన్​వీ రమణతోపాటు, జస్టిస్​ హిమా కోహ్లీ, ఏఎస్​ బోపన్నలతో కూడిన ధర్మాసనం సూచించింది. ఉక్రెయిన్‌లో జరుగుతున్న పరిణామాలు దురదృష్టకరమని విచారం వ్యక్తం చేసింది.

‘చరిత్ర నుంచి మనం పాఠాలు నేర్చుకోలేకపోవడం దురదృష్టకరం. యుద్ధాలతో ఎంతో నష్టం జరిగింది. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. విద్యార్థుల తరలింపు ప్రక్రియపై ప్రస్తుతం మేము ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయబోము. ఆ విద్యార్థులందరూ సురక్షితంగా చేరడంపైనే మా ఆందోళన’ అని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. ఉక్రెయిన్​లో చిక్కుకున్న విద్యార్థుల తరలింపు ప్రక్రియలో తన వంతు కృషి చేసిన అటార్నీ జనరల్​ కేకే వేణుగోపాల్​ను సుప్రీంకోర్టు ప్రశంసించింది. ఇప్పటివరకు 17వేల మందిని ఉక్రెయిన్​ నుంచి తరలించామని.. మరో 7000 మందిని తీసుకురావాల్సి ఉందని అటార్నీ జనరల్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని