PM Modi: ఎన్నో మంచి పనులకు రాజకీయ రంగులంటుకుంటున్నాయి: మోదీ

దేశ పౌరుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అనేక పనులకు రాజకీయ రంగులు పులుముకుంటున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు........

Published : 19 Jun 2022 16:34 IST

దిల్లీ: దేశ పౌరుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అనేక పనులకు రాజకీయ రంగులు పులుముకుంటున్నాయని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) పేర్కొన్నారు. ‘ఎన్నో మంచి పనులు, సదుద్దేశంతో చేపట్టిన చర్యలు రాజకీయ రంగు పులుముకోవడం మన దేశ దురదృష్టం’ అని వ్యాఖ్యానించారు. త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’ (Agnipath) పథకాన్ని వ్యతిరేకిస్తూ నిన్న దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగుతున్న నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దిల్లీలో నిర్మించిన ‘ప్రగతి మైదాన్‌ సమీకృత రవాణా నడవ’ను ప్రారంభించిన ప్రధాని మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ ఇది నయా భారతదేశం అని, సమస్యలను పరిష్కరించుకుంటుందని పేర్కొన్నారు.

కేంద్రం తీసుకున్న పలు ప్రధాన నిర్ణయాలు వ్యతిరేకతను ఎదుర్కొన్నాయి. పౌరసత్వ సవరణ చట్టంపై తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. దేశ రాజధాని దిల్లీలో పెద్ద ఎత్తున హింసలు చెలరేగాయి. ఇదికాకుండా, మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ ఏడాదిపాటు రైతులు ఓ ఉద్యమమే చేశారు. పంజాబ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి వేలాది మంది రైతులు దిల్లీ సరిహద్దులకు చేరుకొని నిరసనలు చేపట్టారు. దీంతో దిగొచ్చిన ప్రభుత్వం ఆ మూడు చట్టాలను వెనక్కి తీసుకుంది.

త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్రం తాజాగా తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’ పథకం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. అనేక రాష్ట్రాల్లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. తమకు అన్యాయం జరుగుతోందంటూ ఆర్మీ అభ్యర్థులు ఆందోళనలకు దిగారు. పలు రాష్ట్రాల్లో రైళ్లను తగులబెట్టారు. అనేకమంది నేతల ఇళ్లకు సైతం ఈ నిరసన సెగ తగిలింది. ఈ నేపథ్యంలోనే ఈ పథకంపై సైన్యం వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. సైన్యంలో సగటు వయసు తగ్గించేందుకే సంస్కరణలు తీసుకొస్తున్నామని త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు పేర్కొన్నారు. అగ్నిపథ్‌పై రెండేళ్లుగా అధ్యయనం చేసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు